టమాట, నూనె గింజల ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ
ఎమ్మిగనూరురూరల్: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో టమాట, నూనె గింజల ఆధారిత ఉత్పత్తులపై ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన వారికి ఆరు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా. కె. రాఘవేంద్ర చౌదరి తెలిపారు. మంగళవా రం ఆయన మాట్లాడుతూ కెనరా బ్యాంక్ స్వ యం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న వారికి చిరుధాన్యాలు, ఆపరాలు, నూనె గింజలు, టమాటలో విలువ ఆధారిత ఉత్పత్తులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణకు వచ్చే అభ్యర్థులు 18–45 సంవత్సరాల లోపు వారై, చదవటం, రాయడం వచ్చి ఉండాలి, ఆరు రోజుల శిక్షణలో ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 11వ తేదీ లోపు కేవీకేలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9346045968 ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
దీపం పథకానికి ఈకేవైసీ చేయించుకోవాల్సిందే
కర్నూలు(సెంట్రల్): దీపం–2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం రేషన్ కార్డు కలిగిన వినియోగదారులు వారి గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీని సంబంధిత ఏజెన్సీల దగ్గర చేయించుకోవాలని డీఎస్‌ఓ రాజారఘువీర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులు మొదటి సిలిండర్‌ను పొందడానికి మార్చి – 2025 వరకు అవకాశం ఉందని చెప్పారు.
ఉల్లి ధరల్లో పురోగతి
కర్నూలు(అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో కర్నూలు మార్కెట్‌లో కూడా ధరల్లో రోజురోజుకు పురోగతి ఉంటోంది. ఉల్లి ధరలను మహారాష్ట్రలోని దిగుబడులు ప్రభావితం చేస్తాయి. మహారాష్ట్రలో దిగుబడులు ఎక్కువగా ఉంటే ఇక్కడ ధరలు తగ్గుతాయి. అక్కడ దిగుబడులు పడిపోతే ఇక్కడ పండించిన ఉల్లికి డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి దిగుబడులు తక్కువగా ఉండటంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ పండించిన ఉల్లి ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు తరలుతోంది. అక్కడి నుంచి విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. సోమవారం కర్నూలు మార్కెట్‌లో గరిష్ట ధర రూ.4,439 లభించింది. మంగళవారం కనిష్ట ధర రూ.644, గరిష్ట ధరరూ.4,669 లభించింది. సగటు ధర కూడా ఆశాజనకంగా నమోదైంది. సగటు ధర రూ.3,898 నమోదైంది. సగటు ధరను పరిశీలిస్తే రైతులకు లభిస్తున్న ధరలు మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా మార్కెట్‌కు ఉల్లి తాకిడి మరింత తగ్గింది. ఉల్లి రావడం సాధారణ స్థితికి చేరినట్లు స్పష్టమవుతోంది. 314 మంది రైతులు 6,879 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే మార్కెట్‌కు తెచ్చారు.
రోగుల సహాయకులకు విజిటింగ్ పాస్‌లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో రోగుల సహాయకులకు విజిటింగ్ పాస్‌లు జారీ చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయనను కలిసిన ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడుతూ ఒక రోగితో నలుగురైదుగురు సహాయకులు రావడం వల్ల ఆసుపత్రిలో రద్దీ అధికమైందన్నారు. ఇలా వచ్చిన వారు ఆసుపత్రి ఆవరణలో ఉండి చెత్తాచెదారాన్ని అక్కడే వేస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రి పరిశుభ్రత దెబ్బతింటోందని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డుల్లో ఎక్కువ మంది ఇతరులు తిరగడం వల్ల రోగులకు ఇన్‌ఫెక్షన్ ఎక్కువై వారు కోలుకునేందుకు ఆలస్యం అవుతుందని, కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుందని అభిప్రాయపడ్డారు. దీనిని నివారించేందుకు విజిటింగ్ పాస్‌లు జారీ చేయడమొక్కటే పరిష్కారమార్గమన్నారు.
దూరవిద్య పరీక్ష కేంద్రం రద్దు
కర్నూలు సిటీ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య పరీక్షల్లో జిల్లాలోని గూడూరు శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంతో ఆ కేంద్రాన్ని రద్దు చేశారు. ఈ కేంద్రంలోని పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కర్నూలు నగరంలోని ఎస్‌ఎల్‌ఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షలు రాసేలా మార్పు చేసినట్లు వర్సిటీ దూర విద్య కో–ఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు హాల్ టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment