కూటమి నేతలకు చేదు అనుభవం
● యురేనియంపై అపోహలు తొలగిస్తామని టీడీపీ నేతలసభ నిర్వహణ ● కల్లబొల్లి మాటలొద్దు అంటూ చుట్టుముట్టిన ప్రజలు ● కలెక్టర్ లిఖితపూర్వకంగా రాసివ్వాలని పట్టు
మీ మాటలు మేము నమ్మం
ఒకప్పుడు ఫ్యాక్షన్ వల్ల ఆస్తిని, మా కుటుంబాలను కో ల్పోయాం. ఇక్కడే కొండపైన తినో తినకా పైసా పైసా కూ డబెట్టుకుని పొలాల్లో బోర్లు వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఇక్కడ యురేనియం ఉందని గత పది రోజులుగా నిద్ర లేకుండా బతుకుతున్నాం. మాకు అధికారుల
నుంచి రాతపూర్వకంగా రాయిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తాం. – లక్ష్మమ్మ, మాదాపురం గ్రామం
ఏది నమ్మాలి
ఇక్కడ యురేనియం లేదు. అపోహ పడుతున్నా మని మీరే చెబుతున్నారు. గతంలో వేసిన బోర్లు యురేనియం టెస్టింగ్ కోసమేనని మీరే చెబుతున్నారు. ఏది నిజం. మాకు రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలు జరపమని రాసి ఇవ్వాలి. లేకుంటే మేము ఎవరి మాట వినము.
– శ్రీనివాసులు, గుడిమిరాళ్ల గ్రామం
దేవనకొండ: యురేనియం భయంతో దాదాపు పది రోజులుగా ఆందోళన చేస్తున్న కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ సమీప గ్రామాల ప్రజల నుంచి కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కప్పట్రాళ్ల ఫారెస్టులో యురేనియం తవ్వకాలను ఆపివేయాలంటూ కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల గ్రామాలైన కప్పట్రాళ్ల, పి.కోటకొండ, జిల్లెడు బుడకల, కె. వెంకటాపురం, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బేతపల్లి, బండపల్లి, మాచాపురం, దుబ్బనకుర్తి, ఈదులదేవరబండ, చెల్లెలచెలిమల తదితర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. యురేనియంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిస్తామంటూ మంగళవారం కొండపై చెన్నకేశవస్వామి ఆలయంలో కూటమి నాయకులు టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వీరభద్రగౌడ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆలూరు జనసేన ఇన్‌చార్జి వెంకప్ప, టీడీపీ సీనియర్ నాయకులు హర్షవర్దన్‌రెడ్డి తదితర కూటమి నాయకులు సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి యురేనియం తవ్వకాలు జరపబోమని, వైఎస్సార్‌సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. ఆయన ప్రసంగానికి ఒక్కసారిగా మహిళలందరూ అడ్డుపడి.. ‘మీరు మాకు కల్లిబొల్లి కబుర్లు చెపొద్దు.. ఇక్కడ యురేనియం ఎట్టి పరిస్థితుల్లో తవ్వనీయం.. కలెక్టర్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదు’ అని తేల్చి చెప్పారు. ప్రజలు రోజూ పనులు మానుకుని ధర్నా చేస్తున్నా జిల్లా కలెక్టర్ ఎందుకు రావడం లేదని ప్రజలు ప్రశ్నించారు. చివరకు కూటమి నేతలు చేసేదేమి లేక రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ ఇక్కడికి వస్తారని చెప్పి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment