అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
కల్లూరు: అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవల అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్‌కు పంపిన పార్టీ సోషల్ మీడియా నంద్యాల జిల్లా కో–కన్వీనర్ తిరుమల కృష్ణను రాంభూపాల్‌రెడ్డి మంగళవారం కర్నూలు జైల్‌లో ములాఖత్ అయి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాంభూపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతున్నారన్న అక్కసుతో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదన్నారు. తిరుమల కృష్ణ దివ్యాంగుడు అని కూడా చూడకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్‌సీ పీ సోషల్ మీడియా సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినంత మాత్రాన ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియకుండా ఉండవన్నారు. అమ్మాయిలు, చిన్నపిల్లలపై అత్యాచారం, రౌడీయిజం చేసేవారిపై పోలీసులు తమ పవర్ చూపాలని హితవు పలికారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం అమాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, ఇప్పటి వరకు ఇంత చెత్త పరిపాలన చూడలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనే స్థాయికి పాలన వచ్చిందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఆయన వెంట కార్పొరేటర్లు నారాయణరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, అశోక్‌వర్దన్ రెడ్డి, రమణారెడ్డి, హనుమంత్‌రెడ్డి, మహేష్ ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment