సమన్వయంతో వలసలు నివారిస్తాం
● డ్వామా పీడీ వెంకటరమణయ్య వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): ఫీల్డ్ అసిస్టెంటు మొదలుకొని జిల్లా స్థాయి వరకు అందరం సమన్వయంతో పనిచేసి వలసలను నివారిస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.వెంకటరమణయ్య అన్నారు. ఎంపీడీవోగా 22 ఏళ్ల పనిచేశానని, ఉపాధి పనులపై పూర్తి అవగాహన ఉందని, జిల్లాలో మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఆయనను జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించడంతో గురువారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలసి పూల బొకే అందజేశారు. నూతన పీడీని అదనపు పీడీని మాధవీలత, పరిపాలన అధికారి విజయలక్ష్మి, పైనాన్స్ మేనేజర్ ఆదెయ్య, ఏపీడీలు, వాటర్‌షెడ్ అధికారులు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
గుండ్రేవుల పరిశీలన
కర్నూలు (సిటీ): సి.బెళగల్ మండలం గుండ్రేవుల సమీపంలోని తుంగభద్ర నదిని కర్నూలు ప్రాజెక్ట్ సీఈ కబీర్ బాషా, కర్నూలు సర్కిల్ ఇన్‌చార్జి పర్యవేక్షక ఇంజనీర్ బి.బాలచంద్రారెడ్డి, కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, డీఈ ప్రసాద్‌రావు గురువారం పరిశీలించారు. గుండ్రేవుల దగ్గర 20.15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని కేసీ ఆయకట్టు రైతులు, పశ్చిమ పల్లె ప్రజలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తామని ఎలాంటి డిజైన్స్ లేకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టుగా మారడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు కొనసాగలేదు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణ అంశంపై ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గుండ్రేవుల నిర్మాణంపై ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. దీంతో స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రిజర్వాయర్ నిర్మాణం కోసం మళ్లీ అంచనాలను వేసేందుకు అధికారులు మరోసారి గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతిపాదన ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఎల్లెల్సీకి మార్చి 31 వరకు నీటి విడుదల
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు వచ్చే ఏడాది మార్చి 31 వరకు సాగు నీరు విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర నీటి సలహా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీబీ బోర్డు అధికారులు వెల్లడించారు. గురువారం బెంగళూరులోని వికాస సౌదలో సాగు నీటి సలహా మండలి(ఐసీసీ) సమావేశం నిర్వంచారు. రబీ సీజన్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్ర అధికారులు తమ కోటాలో ఎంత మేర నీరు కావాలో ఇండెంట్ పెట్టిన తర్వాత పరిశీలించి విడుదల చేయాలని నిర్ణయించారు.
శ్రీశైల దేవస్థానం
పర్యవేక్షకుడిపై సస్పెన్షన్ వేటు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని అన్నప్రసాద వితరణ విభాగంలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న సి.మధుసూదన్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం మధ్యాహ్నం భక్తుడి మాదిరిగా దేవస్థాన ఈఓ చంద్రశేఖర ఆజాద్ అన్నప్రసాద వితరణ భవనానికి చేరుకుని భక్తులతో పాటు కలిసి భోజనం స్వీకరించారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ సూచించిన దిట్టం మేరకు ఆహార పదార్థాలు వడ్డించడం లేదని గమనించారు. అంతేకాకుండా స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చే భక్తులకు సరిపడ కూరలు, పప్పు, అన్నప్రసాద వితరణలో జరిగేటట్లు చూసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని తనిఖీలో వెలుగులో చూసింది. అలాగే సాధారణ రోజుల్లో, రద్దీ రోజుల్లో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు సరిపడ భోజన పదార్థాలు తయారు చేయించడంలో విఫలమయ్యారని బయటపడింది. ఈ నేపథ్యంలో అన్నప్రసాద వితరణ విభాగం పర్యవేక్షకులు సి.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ శ్రీశైల దేవస్థాన ఈఓ చంద్రశేఖర ఆజాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment