పెళ్లి వేడుకలో విషాదం
● పెళ్లి కుమారుడికి గిఫ్ట్ ఇస్తూ కుప్పకూలిన మిత్రుడు
● గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు
● మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి
కృష్ణగిరి: మండల పరిధిలోని పెనుమాడ గ్రామంలో గురువారం జరిగిన ఓ పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది. మిత్రులతో కలిసి పెళ్లి జంటకు గిఫ్ట్ ఇచ్చే సమయంలో ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అప్పటి వరకు సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా నిశబ్ధం అలుముకుంది. పెనుమాడ గ్రామానికి చెందిన శివయ్యగౌడ్ కుమారుడు రవికిరణ్ గౌడ్, గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన వంశీకుమార్ (28) ఇద్దరు స్నేహితులు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. స్నేహితుడు రవికిరణ్గౌడ్ పెళ్లికి పెనుమాడ గ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి తలంబ్రాలు అయిన తరువాత తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేందుకు వేదికపైకి చేరుకున్నాడు. ఇంతలోనే వంశీకుమార్ పక్కకు ఒరుగుతుండగా స్నేహితులు పట్టుకున్నారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం డోన్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. మృతుడి తల్లిదండ్రులు చిన్నమాదన్న, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన వంశీకుమార్ బెంగళూరులో అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment