‘పది’కి ప్రణాళికేదీ? | - | Sakshi
Sakshi News home page

‘పది’కి ప్రణాళికేదీ?

Published Sun, Nov 24 2024 5:28 PM | Last Updated on Sun, Nov 24 2024 5:28 PM

‘పది’కి ప్రణాళికేదీ?

‘పది’కి ప్రణాళికేదీ?

● ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షల సమయం ● హాజరుకానున్న 29 వేల మంది విద్యార్థులు ● ఇంత వరకు పూర్తికాని సిలబస్‌ ● స్టడీ మెటీరియల్‌పై స్పష్టత కరువు ● నామమాత్రంగా ప్రత్యేక తరగతులు ● నిత్యం సమీక్షలు, సమావేశాలకే పరిమితమైన డీఈఓ ● పరీక్షా విధానంపై నేటికీ స్పష్టత రాని వైనం

సీబీఎస్‌ఈ సిలబస్‌ రద్దుతో

అయోమయం

జిల్లాలో 90 ఉన్నత పాఠశాలల్లో గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం సీబీఎస్‌ఈ స్కూళ్లను రద్దు చేసింది. సుమారుగా 3 నెలలు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివిన విద్యార్థులు.. ఆ స్కూళ్లను రద్దు చేయడంతో ఏ సిలబస్‌ చదవాలి? ఏ ప్యాట్రన్‌లో పరీక్షలు రాయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. కేజీబీవీలను పర్యవేక్షణ చేయాల్సిన జీసీడీఓ పోస్టు ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ఓ టీచర్‌ను నియమించినా.. కేజీబీవీల్లో అడ్మిషన్లు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీలో అకడమిక్‌ ఇయర్‌ మొదలైనప్పటి నుంచి వాటికే పరిమితమయ్యారు. ఆ స్కూళ్లను పర్యక్షవేక్షించే వారు లేకపోవడంతో అసలు అక్కడ ఏమీ జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఏపీ మోడల్‌ స్కూళ్లపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ ఏడీ ఉన్నప్పటికీ ఆ స్కూళ్ల గురించి పట్టించుకోవడం లేదు. ఆ స్కూళ్లపై పర్యవేక్షణ లేక.. టీచర్లు తరగతులు సరిగ్గా చెప్పడం లేదనే విమర్శలున్నాయి.

కర్నూలు సిటీ: జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మొత్తం 324 ఉన్నాయి. ఈ స్కూళ్లలో సుమారు 29 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పది పరీక్షల ఫలితాలు పెంచేందుకు ఉదయం గంట, మధ్యాహ్నం గంట ప్రత్యేక స్టడీ అవర్స్‌ నిర్వహించాలని, ప్రత్యేక ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ఆదేశాలు ఇచ్చారు. అయితే స్టడీ అవర్స్‌ అనేవి నామమాత్రంగా జరుగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణను గాలికొదలడంతో హెచ్‌ఎం, టీచర్లు కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పది పరీక్షల ఫలితాల పెంపునకు గతంలో సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేసి, వారితో స్టడీ మెటీరియల్‌ను తయారు చేయించే వారు. ఎఫ్‌.ఏ–1, ఎఫ్‌.ఏ–2 పరీక్షలతోపాటు, స్లిప్‌ టెస్ట్‌లలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరిలుగా విభజించి సీ, డీ క్యాటగిరి విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను తయారు చేసి, వారిపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ఏ అంశాలపై ఆ విద్యార్థులు వెనకబడి ఉన్నారో తెలుసుకుని పునశ్చరణ తరగతులు సైతం నిర్వహించే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆ వైపుగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. స్టడీ మెటీరియల్‌ తయారీపై ఇంత వరకు స్పష్టత లేదు.

గత ఏడాది ఫలితాలపై సమీక్ష ఏదీ?

పది పరీక్షల ఫలితాలను గతేడాది వచ్చిన ఫలితాలపై సమీక్షించి గతంలో ఏఏ సబ్జెక్టులలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు..అందుకు కారణాలు ఏంటీ? ఈ ఏడాది వాటిని అధిగమించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ బోధనలో అనుభవం ఉన్న సబ్జెక్టు నిపుణులతో పాటు, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోగా, ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణను గాలికొదిలేసింది. మొన్నటిదాకా డీఈఓగా ఉంటూ ఇన్‌చార్జ్‌ ఆర్జేడీగా పని చేసిన శామ్యూల్‌ సైతం పది ఫలితాల పెంపుపై ఎలాంటి సమీక్షాలు నిర్వహించలేదు. ప్రస్తుత డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్‌.శామ్యూల్‌పాల్‌ కూడా నిత్యం కలెక్టరేట్‌లో సమీక్షలు, కమిషనర్‌ వెబెక్స్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌లతోనే బిజీగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఒకటో.. రెండో స్కూళ్లను తనిఖీ చేసి రావడమే కానీ ఇంత వరకు హైస్కూళ్ల హెచ్‌ఎంలతో పది ఫలితాల పెంపుపై ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. ఇక రెగ్యులర్‌ డిప్యూటీ ఈఓలు లేకపోవడంతో ఎంఈఓ–1గా పని చేసే వారికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. వారి రెగ్యులర్‌ విధులతోపాటు, డిప్యూటీ ఈఓలుగా అదనపు బాధ్యతలకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

టెన్త్‌ ఎగ్జామ్స్‌ అంటేనే ఓ రకమైన వైబ్రేషన్‌. పదో తరగతి పిల్లలున్న ఇళ్లల్లో అయితే ఆ ఏడాదంతా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ‘మా బాబు ఈసారి పదో తరగతి.. మా పాప ఈ ఏడాది టెన్త్‌ ఎక్కడికీ రాలేం’ అంటూ తెగేసి చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వంద శాతం ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది పరీక్షల సమయం సమీపిస్తున్నా కూటమి ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. సిలబస్‌ పూర్తి కాలేదు. స్టడీ మెటీరియల్‌ ఇవ్వలేదు. పరీక్ష విధానంపై స్పష్టత లేదు. నామమాత్రంగా ప్రత్యేక తరగతులతో కాలయాపన చేస్తూ వస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా 29 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రణాళిక తయారు చేస్తున్నాం

ఇటీవల జిల్లా కలెక్టర్‌ చేసిన సూచనలు మేరకే పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నాం. స్టడీ మెటీరియల్‌ను తయారు చేసేందుకు కర్నూలు ఎంపీ బి.నాగరాజు సాయం చేస్తామన్నారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను క్యాటగిరిలుగా వేరు చేసి సీ, డీ క్యాటగిరి పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడతాం. కచ్చితంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్‌.శామ్యూల్‌ పాల్‌, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement