బీసీల్లో ఐక్యత పెరగాలి
కర్నూలు(అర్బన్): బీసీల్లో ఐక్యత పెరగాల్సిన అవసరముందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక నందికొట్కూరు రోడ్డులోని ఆదర్శ విద్యా మందిర్ ప్రాంగణంలో నిర్వహించిన బీసీ శంఖారావం మహాసభ, బీసీ కులాల వనభోజన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు మొదటి విడతగా 50 వేల మందికి ఉచితంగా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, కుట్టు మిషన్లు అందజేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా అన్ని రంగాల్లో బీసీ మహిళలు ముందుండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ క్రిష్ణయ్య మాట్లాడుతూ బీసీలు ఎంత కష్టమైనా సరే తమ పిల్లలను చదివించుకోవాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం ఎంపీలు బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఏపీ టూరిజం, కురువ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు నూకరాజు బాలాజీ, మాన్వి దేవేంద్రప్ప, సావిత్రమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి
ఎస్ సవితమ్మ
Comments
Please login to add a commentAdd a comment