లారీ ఢీకొని వ్యక్తి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని నంద్యాల రహదారి వైపు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో శనివారం లారీ ఢీకొని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన నాగన్న(50) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన నాగన్న బియ్యం కోసం పట్టణానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నంద్యాల రోడ్డులో ఉన్న రైస్ మిల్ వద్ద కాలినడకన వెళ్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో లారీ వెనుక టైర్లు మీద ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమణ తెలిపారు.
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
● 12 మోటారు సైకిళ్లు, ఆటో స్వాధీనం
కర్నూలు (టౌన్): మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ బాబుప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఇటీవల కర్నూలు నగరంలో మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసులు ఎక్కువగా నమోదు కావడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే వాహనాల తనిఖీ చేపట్టారు. స్థానిక నంద్యాల చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి డోన్ కొండపేటకు చెందిన నాగుల వినయ్ ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకుని విచారిచగా నేరాలు అంగీకరించాడు. ఇప్పటికే ఇతడిపై 13 కేసులున్నాయి. అతని వద్ద నుంచి 12 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.9.10 లక్షలు ఉందని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment