దర్జాగా కబ్జా
ఖాళీ జాగాలో బండలతో హద్దులు ఏర్పాటు చేసుకున్న దృశ్యం
పేదోడి సొంతింటి కలను సాకారం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బృహత్తర కార్యం చేపట్టింది. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసింది. ఊళ్లను తలపించేలా జగనన్న కాలనీలను నెలకొల్పింది. అలాంటి కాలనీల్లో టీడీపీ, జనసేనలు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ జాగాల్లో పాగాకు తెర తీశారు. పబ్లిక్ పర్పస్ స్థలాలతోపాటు అక్కడక్కడా పేదల ప్లాట్లను ఆక్రమించుకునే పనిలో పడ్డారు. రాత్రికి రాత్రే నాపరాళ్లను పాతుకుని పాగా జాతర చేసుకుంటున్నారు. అరికట్టాల్సిన అధికారులు అధికార దర్పానికి తలొగ్గి వేడుక చూడాల్సి వచ్చింది. – మంత్రాలయం
మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో పాతికేళ్ల క్రితం పేదలకు పట్టాలిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టణ వాసులకు ఇంటి స్థలాలు ఇవ్వలేక పోయాయి. దీంతో ఇక్కడి పేదలు గుడిసెల్లోనే కాపురాలు సాగిస్తూ వచ్చారు. పేదల ఇక్కట్లు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించారు. రూ.కోటిన్నరతో భూములు కొనుగోలు చేసి దాదాపు 964 మేర ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రాలయం – ఎమ్మిగనూరు జాతీయ రహదారికి తూర్పు దిక్కున, రాఘవేంద్రపురం దక్షిణ భాగంలో రెండు జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు రహదారి వైపు 271/3, 272/1, 272/4, 274/1 సర్వేనంబర్లలో 11.17 ఎకరాల్లో కాలనీ నిర్మించారు. అలాగే రాఘవేంద్రపురం దక్షిణ దిశలో 335/1 సర్వే నంబర్‌లో 4.89 ఎకరాల్లో మరో కాలనీ ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల్లో ఇప్పటికే 60 శాతం పేదలు ఇళ్లు నిర్మాణాలు చేసుకున్నారు. ఇంకొన్ని ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. కాగా 80 సెంట్లకుపైగా కాలనీవాసులు సౌకర్యార్థం స్థలాలు వదిలేశారు. సదరు స్థలాల్లో మున్ముందు పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, హెల్త్‌సెంటర్లు, తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేలా వదలడం జరిగింది.
ఖాళీ జాగాల్లో కబ్జాలు
జగనన్న కాలనీల్లో ఇళ్లు వెలియడంతో టీడీపీ, జనసేన మూకల కన్ను పడింది. కాలనీల్లో ప్లాట్ల విలువ సైతం అమాంతం పెరిగింది. అధికారం వచ్చింది కదా అని, తమదే రాజ్యమంటూ ఇరు పార్టీల చోటా సేనలు కబ్జాలకు దిగారు. ముందుగా కాలనీ సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను టార్గెట్ చేసుకున్నారు. చేతనైన కాడికి ఖాళీ జాగాలో హద్దులు గీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు రోడ్డులోని కాలనీలో నాపరాళ్లను సిద్ధంగా ఉంచుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ఏకంగా నాపరాళ్లను తెప్పించి పాతుకునే పనిలో పడ్డారు. రెండు కాలనీల్లోనూ ఇప్పటికే దాదాపు 80 సెంట్ల స్థలాలను ఆక్రమించుకున్నట్లు సమాచారం. సదరు స్థలాల విలువ ఎంతలేదన్నా రూ.2 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఇదివరకే పేదలకు కేటాయించిన ప్లాట్లలోనూ నాపరాళ్లు పాతుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖాళీ ప్లాట్లను స్వాహా చేయాలనే ఉత్సుకత చూపుతున్నారు. ఆక్రమణదారుల ఆగడాలను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు గతమెన్నడూ చూడలేదని చర్చించుకుంటున్నారు. ఇలా కబ్జా చేసుకుంటూ పోతే కాలనీ వాసుల అవసరాలకు స్థలాలు ఎక్కడ కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి కబ్జాలను తొలగించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.
క్రిమినల్ కేసులు పెడతాం
జగనన్న కాలనీల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇది వరకే హెచ్చరికలు జారీ చేశాం. అలాగే నడుచుకుంటే కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ఏవైనా ఆక్రమణలు చోటుచేసుకుంటే కాలనీ వాసులు తమ దృష్టికి తీసురావచ్చు. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– ఎస్.రవి, తహసీల్దార్, మంత్రాలయం
జగన్న కాలనీలో స్థలాలను
ఆక్రమిస్తున్న టీడీపీ, జనసేన నేతలు
ప్రజల సౌకర్యార్థం స్థలాలను
వదలని వైనం
Comments
Please login to add a commentAdd a comment