చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం, నందివర్గ గ్రామ చేనేత స్టాల్‌ను ప్రారంభించి అధికారులందరిచే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రతివారం ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు.
తామ్ర శాసనాల పరిశీలన
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని ఘంటా మఠం వద్ద 2017– 2020 మధ్యకాలంలో జరిగిన జీర్ణోద్ధరణ పనుల సందర్భంగా లభ్యమైన తామ్ర శాసనాలను పురావస్తు శాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. అప్పట్లో బంగారు, వెండి నాణేలు, విలువైన బంగారు కంకణాలతోపాటు 53 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. వాటిని దేవస్థానం అధికారులు భద్రపరిచి పురావస్తు శాఖ అధికారులకు తెలియజేశారు. వారు అప్పట్లో ఆలయానికి చేరుకుని ఫొటోలు తీసుకెళ్లి తెలుగుకి తర్జుమా చేశారు. ఈక్రమంలో శాసనాలను మరోసారి పరిశీలించి తర్జుమా చేసిన తెలుగు భాషలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయేమోనని సరిచూసుకోవడానికి పురావస్తు శాఖ నిపుణుల బృందం సభ్యులు ఎంవీఆర్ వర్మ, శ్రీనివాసరావు వచ్చినట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ బాలమురళి, ఉపస్తపతి జవహర్ పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సు ఢీకొని 9 గొర్రెలు మృతి
హాలహర్వి: మండలంలోని ఆంధ్ర–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందపై దూసుకెళ్లింది. ప్రమాదంలో 9 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల కాపరులు తెలిపిన వివరాలు.. ఆదోని నుంచి బళ్లారి వైపు వెళ్తున్న మీనాక్షి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుపై ఓ పక్కన వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టాడన్నారు. అంతటితో ఆగకుండా వెళ్లిపోయాడన్నారు. ఒక్కో గొర్రె రూ.20 వేల చొప్పున ధర పలుకుతుందని, దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి వాపోయాడు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment