బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Published Tue, Dec 24 2024 1:33 AM | Last Updated on Tue, Dec 24 2024 1:33 AM

బీటెక

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

ఆదోని అర్బన్‌: బీటెక్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాననే దిగులుతో విద్యార్థి నవీన్‌కుమార్‌(20) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఈరన్న టూటౌన్‌ పోలీసులకు తెలిపిన వివరాలు.. నవీన్‌కుమార్‌ స్థానిక ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో 3వ సంవత్సరం చదువుకుంటూనే సెల్‌ఫోన్‌ షాపులో పని చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉన్నాడు. ఇటీవల వెలుబడిన రెండో ఏడాది పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. ఈ విషయంలో దిగులు చెందుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని మృతదేభాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు.

27న వాలీబాల్‌

ఎంపిక పోటీలు

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 27 ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీనియర్‌ మహిళలు, పురుషుల రాష్ట్రస్థాయి వాలీబాల్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జిల్లా సీనియర్‌ వాలీబాల్‌ మహిళా, పురుష క్రీడాకారులు ఆధార్‌ కార్డు, నేటివిటీ, 10 ఫొటోలతో వాలీబాల్‌ కోర్టులో హాజరు కావాలన్నారు. అక్కడ ఎంపికై న క్రీడాకారులను వచ్చేనెల 7 నుంచి 13వ తేదీ వరకు రాజస్తాన్‌లోని జయపూర్‌లో నిర్వహించనున్నట్లు జాతీయ స్థాయి పోటీలకు పంపుతారన్నారు.

గొలుసు దొంగ అరెస్టు

కర్నూలు: మండలంలోని ఎల్‌.పేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెంచలమ్మ పుస్తెల గొలుసును అపహరించిన దొంగను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన మద్దూరు వెంకటేశ్వర్లు ఈనెల 20న పెంచలమ్మ మెడలో బంగారు గొలుసు అపహరించాడు. పక్కా ఆధారాలతో వెంకటేశ్వర్లును సోమవారం గణేష్‌ నగర్‌ వక్కెరవాగు దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ శేషయ్య తెలిపారు.

మూగలదొడ్డిలో మొసలి కలకలం

కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామ శివారు ఇళ్ల సమీపంలో మొసలి సోమవారం కలకలం రేపింది. మూలగదొడ్డి గ్రామం నుంచి కందుకూరు గ్రామానికి పొలాల వెంబడి అడ్డదారి ఉంది. మధ్యలో వంక ఉంది. తుంగభద్ర నది నుంచి వంక వెంబడి వచ్చి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అటువైపుగా పొలాలకు వెళ్లే రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొసలిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ జయరాముడు, బీట్‌ ఆఫీసర్లు షమిఉల్లా, రామ్మోహన్‌, శంకర్‌ నాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తుల సహకారంతో పెద్దతాడుతో పట్టుకుని తుంగభద్ర నదిలో వదిలేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం 1
1/1

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement