ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: పత్తికొండ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన శ్రావణ్ కుమార్, మధుకిరణ్‌లు కలసి రూ.1.75 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండ మండలం బుగ్గతండా గ్రామానికి చెందిన శివనాయక్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏఎస్పీ హుసేన్ పీరా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 93 ఫిర్యాదులు వచ్చాయి. చట్ట పరిధిలో వాటన్నింటిపై విచారణ జరిపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఎస్పీ వారికి హామీ ఇచ్చారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన లలితమ్మ ఫిర్యాదు చేశారు.
● గొర్రెల ఫామ్, వ్యాపారానికి సంబంధించిన లోన్‌తో పాటు స్కూల్ డెవలప్‌మెంట్ నిధులు ఢిల్లీకి చెందిన బ్యాంకు నుంచి ఇప్పిస్తానని నకిలీ ఫొటోలు చూపించి కర్నూలుకు చెందిన విజయ్ అలియాస్ మసిపోగు మారెన్న కొంతమందితో డబ్బులు తీసుకుని మోసాలు చేస్తున్నాడని కల్లూరుకు చెందిన వీరేష్ ఫిర్యాదు చేశాడు.
● జొన్న పంటను దున్నించి తనకు నష్టం చేశాడని పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి చెందిన సుంకేసులు ఫిర్యాదు చేశాడు.
● తన రెస్టారెంట్‌లో పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి తన మొబైల్‌ను తీసుకువెళ్లి అందులో రూ.82 వేలు ఫోన్‌పే ద్వారా మహారాష్ట్ర గ్రామీణ బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని ఆదోని శ్రీనివాస భవన్ రెస్టారెంట్ యజమాని చైతన్య ఫిర్యాదు చేశారు.
● అనారోగ్యంతో ఉన్న కొంతమందికి జీవిత బీమా ఇప్పిస్తామని చెప్పి ఎల్‌ఐసీలో పనిచేసే కొందరు మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలుకు చెందిన శివకుమార్ ఫిర్యాదు చేశారు.
ఏఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment