కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ వసతి గృహాలకు డైట్, కాస్మోటిక్ చార్జీలకు సంబంధించి 3,4 క్వార్టర్లకు ప్రభుత్వం రూ.6.74 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి వెంకటలక్షుమ్మ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 28 ప్రీమెట్రిక్ హాస్టళ్లకు 3వ క్వార్టర్ డైట్ చార్జీలకు 2,54,24,500, కాస్మోటిక్ చార్జీలకు రూ.14,43,900, అలాగే 4వ కార్వర్టర్ డైట్ చార్జీలకు రూ.2,39,77,700, కాస్మోటిక్ చార్జీలకు రూ.20,84,600 విడుదలయ్యాయని తెలిపారు. మొత్తం 14 పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లోని విద్యార్థులకు సంబంధించి 3వ క్వార్టర్ కాస్మోటిక్ చార్జీలకు రూ.47,24,800, 4వ క్వార్టర్ డైట్ చార్జీలకు రూ.91,10,600, కాస్మోటిక్ చార్జీలకు రూ.6,79,100 విడుదలయ్యాయని చెప్పారు. కాస్మోటిక్ చార్జీలు 3 నుంచి 6వ తరగతి వరకు బాలురకు నెలకు రూ.130, బాలికలకు రూ.110, 7 నుంచి 10వ తరగతి వరకు బాలురకు రూ.155, బాలికలకు రూ.160 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రీమెట్రిక్ వసతి గృహాల్లోని విద్యార్థులకు బాలికలకు నెలకు రూ.160, బాలురకు రూ.155 ప్రకారం ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
కల్లూరు: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దూపాడు సమీపంలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన రాంప్రసాద్ రెడ్డి (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పెద్దటేకూరులో బావిలో ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నలుగురు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల్లో నలుగురు డిబార్ అయ్యారు. గూడూరు ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4, డోన్ సాయి శ్రీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా మొత్తం నలుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 10,876 మందికి 9,616 మంది హాజరు కాగా 1260 మంది, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలకు 5,086 మందికి 4,600 మంది హాజరు కాగా 486 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కర్నూలు నగరంలోని శంకరాస్ డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య ఎన్‌టీకే నాయక్, సీఈ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment