మంత్రాలయం: మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో చెట్లను నరికివేసిన ఘటనలో ఐదుగురిపి ఎమ్మిగనూరు కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని వీరభద్ర స్వామి జాతర సౌకర్యార్థం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు శివారెడ్డి 1932 జూన్ 5న అదే గ్రామానికి చెందిన కుచ్చలదిన్నె తాయమ్మ నుంచి 20 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదే స్థలంలో ఏటా స్వామి మహారథోత్సవం జరుపుతున్నారు. అప్పట్లో ఆ స్థలంలో 8 మొక్కలు నాటి పెద్ద చేసేవారు. దాదాపు 90 ఏళ్ల క్రితం మొక్కలు నాటడంతో అవి మహావృక్షాలు పెరిగి నీడనిస్తున్నాయి. అయితే తాయమ్మ వంశీకులు ఆ స్థలం తమదంటూ తరచూ యాగీ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో టీడీపీ అధికారంలోకి రాగానే అక్టోబర్ 22న 6 వేప, 2 బసిరి చెట్లను నరికివేశారు. ఇది దౌర్జన్యమంటూ శివారెడ్డి మనవడు రాఘవరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు పెట్టకుండా ఫారెస్టు అధికారులను ఆశ్రయించమని ఉచిత సలహా ఇచ్చారు. అప్పట్లో ఆదోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనురాధ ఘటన స్థలాన్ని పరిశీలించి జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. రాఘవరెడ్డి మాత్రం అటవీశాఖ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే కేసు పెట్టమని స్థానిక పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఎంతకీ స్పందన లేకపోవడంతో ఎమ్మిగనూరు కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేశాడు. కోర్టు సీరియస్‌గా తీసుకుని చెట్లను నరికిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని మంత్రాలయం పోలీసులకు ఆదేశించింది. నాలుగు నెలల తర్వాత సోమవారం మంత్రాలయం పోలీసులు.. చెట్లు నరికిన కురువ లింగన్న, కురువ మల్లయ్య, కురువ రామచంద్ర, కురువ లింగన్న, కురువ గడ్డం భీమయ్యపై కేసు నమోదు చేయడంతో ఫిర్యాదు దారుడు సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment