సంబరాల వేళ మిన్నంటిన విషాదం
● కర్ణాటకలోని సింధనూరు సమీపంలో
వాహనం బోల్తా
● ముగ్గురు శ్రీమఠం వేద పాఠశాల
విద్యార్థుల దుర్మరణం
● వాహనం డ్రైవర్ మృతి
● మంత్రాలయంలో అలుముకున్న
విషాదఛాయలు
మృతి చెందిన వేద విద్యార్థులు
సుజయీంద్ర , అభిలాష్ , హయవదన (ఫైల్)
మంత్రాలయం: నిత్యం వేద ఘోషతో విరాజిల్లే వేదభూమి శోక సంద్రమైంది. కర్ణాటకలోని సింధ నూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు శ్రీమఠం వేద విద్యార్థుల దుర్మరణంతో మంత్రాలయం మూగబోయింది. విద్యార్థుల మృత్యు ఘటన స్థానికులను కలచివేసింది. శ్రీమఠం క్షేత్రం చరిత్రలోనే ఇదో విషాద ఘటన. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠం నేతృత్వంలో గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మధ్వ మత పూర్వపు పీఠాధిపతి నరహరి తీర్థుల ఉత్తరారాధన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి 8 గంటలకు వేద పాఠశాల నుంచి విద్యార్థులను వాహనాల్లో కర్ణాటకలోని హంపిలో నరహరి తీర్థుల క్షేత్రానికి పయనమయ్యారు. పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు ట్రాక్స్ క్రూయిజర్ వాహనంలో బయలుదేరారు. మార్గ మధ్యలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూ రు నియోజకవర్గ కేంద్రాన్ని దాటుకుని వెళ్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో సింధనూరుకు 4 కి.మీ. దూరంలోని వైష్ణవి దేవి ఆలయంతో రాయచూరు–కొప్పళ రహదారిపై ప్రమాదవశాత్తు ముందు టైర్ పేలింది. వేగంగా వెళ్తుండటంతో అదే సమయంలో చక్రం యాక్సిల్ కట్ కావడంతో ట్రాక్స్ క్రూయిజర్ వాహనం మూడు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ముగ్గరుతోపాటు జీపు డ్రైవర్ ప్రమాద స్థలంలోనే దుర్మరణం చెందారు. క్రూయిజర్ పాత వాహనం కావడంతో పాటు అతి వేగంతో ప్రయాణించడం వల్ల టైర్ పేలి ఇంతటి ఘోరం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుల వివరాలు
ప్రమాద ఘటనలో స్థానిక సంస్కృత పాఠశాలలో వేద విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు హ యవదన (18), సుజయీంద్ర (22), అభిలాష్ (20), డ్రైవర్ కంసాలి శివ (20) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన 10 మంది విద్యార్థులు జయసింహ (23), శ్రీహరి (18), విజయేంద్ర (17), భరత్ (16), రాఘవేంద్ర (16), తనీత్ (13), శ్రీఖర (16), వాసుదేవ (14), రాఘవేంద్ర (17), బసంత శర్మ (15) గాయపడ్డారు.
● ఈ ప్రమాదంలో మంత్రాలయానికి చెందిన విష్ణు ఆచార్ (కృష్ణమూర్తి), జానకి దంపతుల ఏకైక కుమారుడు సుజయీంద్ర (22), కంసాలి సోమన్న, కాశమ్మ దంపతుల నాల్గవ కుమారుడు డ్రైవర్ శివ(20) మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రానికి చెందిన అశ్వత్ ఓలీ కుమారుడు అభిలాష్ (20), బళ్లారి జిల్లా వాసి ప్రహ్లాదాచారి కుమారుడు హయవదన (18) మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న సింధనూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకటేష్ చౌహాన్.. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. సింధనూరు ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించగా మిగిలిన క్షతగాత్రులు సింధనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యార్థి సుజయీంద్ర, డ్రైవర్ శివ మృతదేహాలు మంత్రాలయ ం చేరుకున్నాయి. సుజయీంద్ర మృతదేహాన్ని స్థానిక సంత మార్కెట్‌లో ఉంచగా స్థానికులు వేలాది గా తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. ఇరువురికి వారి సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు.
అన్ని విధాలా ఆదుకుంటాం
ఆరాధన వేడుకలకు వెళ్తూ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఆత్మీయ వేద పాఠశాల విద్యార్థుల మృతి పట్ల శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు విషాదాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటన ఎంతగానో కలచి వేసిందని పేర్కొన్నారు. మృతుల కటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాత్రి వరకు సింధనూరులోనే ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుంటూ స్టే చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక ఆసుపత్రి అధికారులకు సూచించారు.
మధ్వమత పూర్వపు పీఠాధిపతి నరహరి తీర్థులు కర్ణాటకలోకి తుంగభద్ర నదీతీరం హంపి క్షేత్రంలో బృందావనస్థులయ్యారు. అయితే సదరు మఠంపై ఆధిపత్యం కోసం కర్ణాకటలోని ఉత్తరాది మఠం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం మధ్య తగవు నడుస్తోంది. ఈ విషయంలో ఇరు మఠాలు కర్ణాటక ధార్వాడ హైకోర్టును ఆశ్రయించాయి. సోమవారం నరహరి తీర్థుల ఆరాధన వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పూర్వారాధనకు శ్రీమఠం నుంచి అర్చకులు వెళ్లి పూజలు చేసుకున్నారు. అంతకు ముందు నరహరి మఠం అధికారాలు ఉత్తరాది మఠానికి చెల్లుతాయని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ శ్రీమఠం ద్విసభ్య ధర్మాసనానికి కేసును తీసుకెళ్లగా మంగళవారం సదరు ధర్మాసనం శ్రీమఠానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మంగళవారం రాత్రి నరహరి క్షేత్రానికి పయనం కట్టారు. బుధవారం ఉదయం ఉత్తరారాధన నిర్వహించాలని మంత్రాలయం నుంచి 10 వాహనాల్లో పీఠాధిపతితో సహా ఉద్యోగులు, అర్చకులు, సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, ప్రముఖులతో హంపికి రాత్రి 8 గంటలకు బయ లు దేరారు. అనుకోని ప్రయాణంతో మార్గ మధ్యలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం ఎందరినో కలచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment