సాంకేతికతతో కేసులు ఛేదించాలి
కర్నూలు: సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ కేసులు ఛేదించాలని పోలీసు అధికారులను డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు. డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ బిందు మాధవ్, అడ్మిన్ ఏఎస్పీ హుసేన్ పీరా తదితరులు హాజరయ్యారు. కడపలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని నంద్యాల మీదుగా రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం కర్నూలు చేరుకున్న డీజీపీకి పోలీసు అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీసులందరూ సమష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, చిన్నపిల్లలు, మహిళలపై జరిగే లైంగిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సూచించారు. ఇందుకోసం విస్తృతంగా టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. అర్హత కలిగిన సీఐలందరికీ త్వరలో డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న డీజీపీ
తాను కర్నూలు జిల్లాలో ట్రైనీ ఏఎస్పీగా చేశానని.. ఆ విషయాలను, జ్ఞాపకాలను డీజీపీ ద్వారకా తిరుమల రావు గుర్తు చేసుకున్నారు. నేరాలను అరికట్టడం, శాంతిభద్రతల పరిరక్షణ విషయాల గురించి శిక్షణ సమయంలో జిల్లాలో అనేక విషయాలు తెలుసుకున్నానన్నారు. అనంతరం డీజీపీని రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ బిందు మాధవ్ కలసి శాలువతో సత్కరించి నటరాజ విగ్రహం జ్ఞాపికను అందజేశారు. అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట పోలీసు అధికారులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడారు. సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, భాస్కర్ రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఆర్‌ఐలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం డీజీపీ రోడ్డు మార్గాన హైదరాబాదు బయలుదేరి వెళ్లారు.
అర్హత కలిగిన సీఐలకు త్వరలో పదోన్నతులు
డీజీపీ ద్వారకా తిరుమల రావు
Comments
Please login to add a commentAdd a comment