విధి వక్రీకరించింది!
ఏటూరునాగారం: విధి వక్రీకరించింది. ఏడాదిన్నర వ్యవధిలో దంపతులను పొట్టన పెట్టుకుంది. ఏడాదిన్నర క్రితం ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి భార్య చనిపోయింది. అప్పటి నుంచి మనోవేదనకు గురైన భర్త అనారోగ్యం బారిన పడి గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఆ దంపతుల పిల్లలు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన మల్లెల రామ్మూర్తి (47), ధనలక్ష్మి (40) దంపతులు. ధనలక్ష్మి 2019లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన కొండాయి ఎంపీటీసీగా గెలుపొందింది. ఈ క్రమంలో గతేడాది జూన్ 5న తేదీన ఇంట్లో ఉన్న ప్రిడ్జ్ శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. అప్పటి నుంచి రామ్మూర్తి మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడ్డాడు. అన్ని తానై తన ఇద్దరు పిల్లలను సాకుతూ వచ్చాడు. అంతలోనే విధి తండ్రిని కూడా పిల్లలకు దూరం చేసింది. ఆరోగ్యం క్షీణించడంతో వరంగల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. ఇద్దరు ఆడ పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకునేవారు. కేవలం ఏడాదిన్నర సమయంలో ఇద్దరు మృతి చెందారు. పెద్ద కుమార్తె దీపిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా చిన్న కూతురు అంజలి ఐదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా విలపించారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
నివాళులర్పించిన బీఆర్‌ఎస్ నాయకులు
అనారోగ్యంతో మృతి చెందిన కొండాయి గ్రామానికి చెందిన రామ్మూర్తి మృతదేహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు నివాళులర్పించారు. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఖాజా పాషా, సంజీవరెడ్డి, చంద్రబాబు, అల్లి శ్రీనివాస్, మాదరి రామయ్య, కాళ్ల రామకృష్ణ, సాగర్, రాజు, వెంకటేశ్వర్లు, రాకేశ్, వెంకటేశ్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిన్నర వ్యవధిలోనే దంపతుల మృతి
విద్యుదాఘాతంతో తల్లి, అనారోగ్యంతో తండ్రి..
అనాథలైన ఇద్దరు పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment