ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
మంగపేట: మండలంలోని బ్రాహ్మణపల్లి అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు కడతి కమల అలియాస్ లక్ష్మితో పాటు పార్టీ కొరియర్ వోయం మంగ్లూను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ కొరియర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరువైపు నుంచి ఏటూరునాగారం వైపునకు వస్తున్నారనే సమాచారం అందింది. దీంతో సిబ్బందితో పాటు బాంబ్‌స్క్వాడ్, క్లూస్‌టీం, సాక్షులను తీసుకుని భద్రాచలం వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలోని బ్రాహ్మణపల్లి అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తితో పాటు మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అప్రమత్తమై ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాంబ్‌స్క్వాడ్ ద్వారా తనిఖీ చేయగా వారి వద్ద 02 డిటోనేటర్లు, 05 జిలెటిన్ స్టిక్స్, సుమారు 05 మీటర్ల కార్‌డెక్స్ వైర్, 06 పెద్ద బ్యాటరీ సెల్స్, 02 పెన్‌డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యాలు(ప్రజావిముక్తి మ్యాగజైన్ 01) స్మార్ట్ ఫోన్, 32 జీబీ స్కాన్‌డిస్క్ మెమోరీ కార్డు లభించాయి. అనంతరం సాక్షుల సమక్షంలో విచారించగా కడతి కమల అలియాస్ లక్ష్మిది ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మద్దూరుదూలేడ్ చింతగుప్ప గ్రామం, కొరియర్ వోయం మంగ్లూది బీజాపూర్‌లోని బేతల్పర కోటగూడ అని తేలింది. మావోయిస్టు అగ్రనాయకులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాలరాజిరెడ్డి అలియాస్ వెంకన్న ఆదేశాల మేరకు కమలను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు తీసుకుని బీజాపూర్‌కు రావాలనే వారి ఆదేశాల మేరకు భద్రాచలంలోని శ్రీ శ్రీనివాస నర్సింగ్‌హోంలో చికిత్స అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో భద్రాచలం నుంచి ఆటోలో వచ్చి బ్రాహ్మణపల్లి వద్ద దిగారు. ఏటూరునాగారం మీదుగా బీజాపూర్ వెళ్లేందకు ఆటో కోసం వేసి ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం సాక్షుల ఎదుట విచారించగా తాము మావోయిస్టులమని అంగీకరించినట్లు ఎస్సై వెల్లడించారు. కాగా, అజ్ఞాతంలో ఉన్న సీపీఐ(ఎంఎల్) మావోయిస్టులు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస ప్రక్రియలో భాగంగా నగదు ప్రోత్సాహంతోపాటు కుటుంబ పోషణ కోసం సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అడవుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయి కన్నవారికి కడుపుకోత మిగిల్చొద్దన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి తమ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
విప్లవ సాహిత్యం, పేలుడు సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్సై సూరి
Comments
Please login to add a commentAdd a comment