ఆపన్నహస్తం అందించరూ!
నర్సింహులపేట : అయ్యో పాపం.. ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చాయి. అనారోగ్య కారణాలతో రెండు సంవత్సరాల వ్యవధిలోనే తల్లిదండ్రులు, మనోవేదనతో రెండు నెలల క్రితం నానమ్మ మృతి చెందారు. ఫలితంగా ఇంటి పెద్దలు చనిపోవడంతో ఆ కుటుంబం (అన్న, చెల్లి, తమ్ముడు) అనాథగా మారింది. ఒక పక్క ఆలనాపాలన చూసుకునే వారు లేక.. మరోపక్క కుటుంబ పోషణ చేపట్టే వారు లేక అవస్థలు పడుతోంది. దాతలు, ప్రభుత్వ సాయం కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన జొగి వెంకన్న, వెంకటలక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు సందీప్, శ్రావణి, రాజేశ్ సంతానం. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై 2014లో తండ్రి వెంకన్న, 2016లో తల్లి వెంకటలక్ష్మి మృతి చెందారు. చిన్న వయసులో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలను నానమ్మ( కొడుకు, కోడలు) అగండమ్మ కూలీ పని చేసుకుంటూ పోషించింది. ఈ క్రమంలో 2021 సంవత్సరంలో శ్రావణిని(మనుమరాలు)కురవి మండలం మొగిలిచర్లకు చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అయితే 2024 జూన్‌లో ఆమె భర్త మృతి చెందాడు. ఈ దంపతులకు అప్పటికే నెల లోపు బాబు ఉన్నాడు. భర్త మృతి చెందడంతో కుమారుడిని తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఒక వైపు కొడుకు, కోడలు.. మరోవైపు మనమరాలి భర్త మృతి చెందడంతో కుటుంబ పెద్ద అగండమ్మ మానసికంగా కృంగిపోయింది. రెండు నెలల క్రితం మృతి చెందింది. ఫలితంగా పిల్లలకు కుటుంబ పోషణ భారమైంది. అన్న, తమ్ముడు, భర్త చనిపోయిన చెల్లితో ఆ కుటుంబం అనాథలుగా మారింది. ఎలా బతకాలో తెలియని పరిస్థితి నెలకొంది. అన్న ఆటో కిరాయికి తీసుకుని వచ్చే డబ్బుతో చాలీచాలని జీవనం సాగిస్తున్నారు. వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందోనే పూరిళ్లు. ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్న తమకు దాతలు, ప్రభుత్వం స్పందించి చేయూతనందించాలని ఆ కుటుంబ వేడుకుంటోంది. ఆర్థిక, వస్తూ రూపేణ సాయం చేసి తమ కుటుంబాన్ని నిలబెట్టాలని సోదరులు, సోదరి చేతులెత్తి వేడుకుంటోంది. కాగా, వీరి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న కరవికి చేందిన గుంటి సురేశ్, బొజ్జన్నపేటకు చెందిన చింతమల్ల యాకయ్య ఇన్‌స్టాగ్రామ్‌లో గంగరబోయిన రఘు వ్యక్తికి సమాచారం అందించారు. స్పందించిన రఘు.. ఇరాక్ ఆర్మీబేస్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడిన మను అనే దాత, పలువురు దాతల సహకారంతో ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. దీంతో రఘును గ్రామస్తులు అభినందించగా, పేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
తల్లిదండ్రులు, నానమ్మ మృతితో
అనాథలైన పిల్లలు
కుటుంబ పోషణకు అవస్థలు
దాతలు, ప్రభుత్వం
చేయూతనందించాలని వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment