ఎరువుల కృత్రిమ కొరత
డోర్నకల్: డోర్నకల్‌లోని ఎరువుల దుకాణాదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం మిరప తోటలు ఏపుగా పెరిగి కాపు దశలో ఉండగా రైతులు ఎరువుల కోసం డోర్నకల్‌లోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ ఎరువులు లేవని డీలర్లు తెగేసి చెబుతున్నారు. స్టాక్ బోర్డులో ఎరువుల నిల్వ ఉందని ఎందుకు సూచించారని రైతులు నిలదీయగా.. పలు సాకులు చెబుతూ విక్రయించడం లేదు. సోమవారం దాన్యాతండాకు చెందిన రైతులు బోడ మురళి, కుమార్ ఎరువుల కోసం ఆరు దుకాణాల్లో అడిగారు. అక్కడ లేవని చెప్పడంతో వారు వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు.
డీలర్లు చెబుతున్న కారణాలు..
తమకు ఎరువుల విక్రయించడం లేదంటూ మురళి విలేకరులకు సమాచారం అందించారు. పలు దుకాణాల డీలర్లను ప్రశ్నించగా వారు విచిత్రమైన కారణాలు చెప్పారు. తన వద్ద ఉన్న ఎరువుల బస్తాలకు రంద్రాలు పడ్డాయని ఓ డీలర్ తెలుపగా.. తన దుకాణంలో ఒక్కో బస్తా ఒక్కోచోట ఉందని మరో డీలర్ తెలిపాడు. పలు ఎరువుల కంపెనీలు తమ ఇతర ఉత్పత్తులను లింక్ పెట్టి అమ్మకాలు చేపట్టాలని నిబంధన పెడుతున్నాయని, కాగా సంబంధిత ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తున్నామని మరో డీలర్ తెలిపాడు. ఎరువుల కొరత ఉన్నందున ఆధార్ కార్డు కలిగిన రైతుకు ఒక్క బస్తా మాత్రమే విక్రయిస్తున్నామని మరో డీలర్ తెలిపాడు. ఇలా విచిత్రమైన కారణాలతో డీలర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
రైతులను ఇబ్బందులకు గురి చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. దుకాణాలలో ఎరువుల నిల్వ సమాచారాన్ని సేకరించి తమ సిబ్బంది సమక్షంలో విక్రయాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.
– మురళీమోహన్, ఏఓ, డోర్నకల్
పలు సాకులు చెబుతూ
రైతులకు విక్రయించని డీలర్లు
అన్నదాతల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment