![మోటార](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/motor_mr-1739131190-0.jpg.webp?itok=GUKYFCfo)
మోటార్లు మాయం!
‘ఈ ఫొటోలోని మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని వెంక్యతండాకు చెందిన రైతు బానోత్ లక్‌పతి త మ వ్యవసాయ బావికి అమర్చిన నీళ్లలోని రూ.30 వేల విలువైన విద్యుత్ మోటారు అపహరణకు గురైంది. గుర్తుతెలియ ని వ్యక్తులు అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్ కనెక్షన్లు తొలగించి విద్యుత్ మోటారుతో పాటు దానికి ఏర్పాటు చేసిన రాగి వైరును అపహరించుకుపోయారు. ఏడాది క్రితం ఇదే విధంగా బావి పైభాగంలో అమర్చిన రూ.15 వేల విలువైన మోటార్‌ను దొంగలు పగులగొట్టారు.’
వ్యవసాయ బావులకు అమర్చిన విద్యుత్ మోటార్లు చోరీ
● రాగి వైరు అపహరించుకెళ్తున్న దుండగులు
● ప్రాణాపాయమని తెలిసినా
యథేచ్ఛగా దొంగతనాలు
మహబూబాబాద్ రూరల్: వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్లు, స్టార్టర్లు చోరీకి గురవుతున్నాయి. ఏటా యాసంగిలో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రైతులు మోటార్లు అమర్చుతారు. అయితే అర్ధరాత్రి పొలాల్లో దొంగలు చొరబడి మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. మోటారు నుంచి కాపర్(రాగి) వైరును బయటకు తీసి విక్రయిస్తున్నారు. చీకట్లో విద్యుత్ వైర్లను కత్తిరించడం అపాయమని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. జిల్లావ్యాప్తంగా వంద వరకు దొంగతనాలు జరిగినా.. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా దుండగులు పొల్లాలోని పాత ట్రాన్స్‌ఫార్మర్ల ప్రాంతాలను టార్గెట్ చేసి మోటార్లు, స్టార్టర్లను ఎత్తుకెళ్తున్నారు. 15 హెచ్‌పీ మోటారులో 10కిలోల కాపర్, 10 హెచ్‌పీ మోటారులో 6 కిలోల కాపర్, 5 హెచ్‌పీ మోటారులో 4నుంచి నాలుగున్నర కిలోల కాపర్ వైరు ఉంటుంది. మార్కెట్‌లో కిలో కాపర్ వైరు ధర రూ.1,500 పలుకుతుండగా ఇదే అదునుగా భావించి దొంగలు విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు..
విద్యుత్ మోటార్ల చోరీ వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. దొంగలు విద్యుత్ వైర్లను ప్రమాదకరంగా కత్తిరించి అలానే వదిలేస్తుండడంతో రైతులకు ప్రమాదం పొంచి ఉంటోంది. మోటార్ల చోరీ వల్ల సాగునీటి ఇబ్బందులతో పాటు తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీస్‌శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి చోరీలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.
100 వరకు..
జిల్లాలోని కొత్తగూడ ప్రాంతంలో మూడు అల్యూమినియం కేసులు నమోదు అయ్యాయని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 32 విద్యుత్ చోరీ కేసులు నమోదుకాగా.. 21ఛేదించామని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా వంద వరకు విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. మోటార్ల చోరీ విషయంలో పోలీస్‌స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలికాలంలో దొంగలు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైరును ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
![మోటార్లు మాయం!1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/07mbd101-330023_mr-1739131190-1.jpg)
మోటార్లు మాయం!
Comments
Please login to add a commentAdd a comment