నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర!

Published Mon, Feb 10 2025 1:33 AM | Last Updated on Mon, Feb 10 2025 1:33 AM

నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర!

నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ముగియనుంది. ఎన్నికల కమిషన్‌ జనవరి 29న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 3 ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నాటికి పూర్వ వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి 17 మంది 23 సెట్లలో నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆశావహులందరూ చివరి రోజు సోమవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 13 మంది స్వతంత్రులు 16 సెట్లలో నామినేషన్లు వేశారు. ప్రధాన సంఘాలు బలపరిచిన నలుగురు మరో ఏడు సెట్లలో నామినేషన్లు భారీ ర్యాలీల నడుమ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీచర్స్‌ జేఏసీ మద్దతుతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్సీ, టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్‌ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, ఏలె చంద్రమోహన్‌, దామెర బాబూరావు, తలకొప్పుల పురుషోత్తంరెడ్డి, డాక్టర్‌ పోలెపాక వెంకటస్వామి, సంగంరెడ్డి సుందర్‌రాజ్‌, చాలిక చంద్రశేఖర్‌, కంటె సాయన్న తదితరులు నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు. సోమవారం కూడా పూర్వ మూడు జిల్లాల నుంచి నామినేషన్లు వేసేందుకు నల్లగొండకు తరలనుండగా.. మరుసటి రోజు మంగళవారం అధికారులు నామినేషన్‌ పత్రాలను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణ.. అదేరోజు సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ఖరారు కానున్నాయి.

ఇప్పటికే 23 సెట్లలో

17 మంది నామినేషన్లు..

రేపు పరిశీలన.. 13న ఉపసంహరణ

సై అంటే సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు

రసవత్తరంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

రసవత్తరంగా పోరు..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఈనెల 14 నుంచి రసవత్తరంగా మారనుంది. ప్రచారం హోరెత్తించేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో 191 మండలాల నుంచి 24,905 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా పురుషులు, సీ్త్ర ఓటర్లు కలిపి 5,098 మంది ఉండగా.. అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల నుంచి 163 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 4,483, ఖమ్మం 3,955, సూర్యాపేట 2,637, వరంగల్‌ 2,225, భద్రాద్రి కొత్తగూడెం1,949, మహబూబాబాద్‌1,618, యాదాద్రి 921, జనగామ 921, ములుగు 612, జేఎస్‌ భూపాలపల్లిలో 323 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాగా, నామినేషన్ల ఘట్టం ముగియడమే తరువాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్న చర్చ ఆ వర్గాల్లో సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement