![వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకుంటున్న ఎస్‌ఐ బాలవెంకటరమణ - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/4/03klp04-210052_mr.jpg.webp?itok=-Uhbe9fz)
వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకుంటున్న ఎస్‌ఐ బాలవెంకటరమణ
కొల్లాపూర్: పట్టణ సమీపంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువు మృతిచెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆందోళన చేపట్టడంతో వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్‌బెట్లకు చెందిన మరాఠి అనిత కాన్పు కోసం శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆమెకు సాధారణ కాన్పు జరగగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంలో నర్సులే కాన్పు చేశారు. అయితే శిశువులో ఎటువంటి చలనం లేకపోవడంతో నర్సులు వెంటనే చిన్నపిల్లల వైద్యునికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పాపను పరీక్షించగా కడుపులోనే మృతిచెంది ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని అనిత భర్త సాయిబాబు, అత్త మంగమ్మకు వైద్యసిబ్బంది తెలియజేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని ఆరోపిస్తూ ఆస్పత్రి గేటు ఎదుట భైఠాయించారు. అనితకు నొప్పులు వస్తున్నాయని చెప్పినా నర్సులు పట్టించుకోలేదని, సరైన సమయంలో కాన్పు చేయ కపోవడం వల్లే పాప చనిపోయిందని వాపోయారు. గతంలో అనితను పరీక్షించిన వైద్యులు కడుపులో పిండం బాగానే ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ బాలవెంకటరమణ ఆస్పత్రికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అయితే బాధిత కుటుంబీకులు ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే పాపను తీసుకువెళ్లి ఖననం చేశారు.
వైద్యశాఖ విచారణ..
వైద్యులు లేకుండా నర్సులే కాన్పు చేయడం, శిశువు మరణించిన అంశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు స్థానికులు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఆయన ఈ ఘటనపై విచారణ జరిపించి, నివేదిక పంపాలని మంత్రి పేషీ నుంచి జిల్లా వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ విచారణ నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమనికుటుంబీకుల ఆందోళన
![ఆస్పత్రి గేటు వద్ద బాధిత కుటుంబీకులు1](https://www.sakshi.com/gallery_images/2023/06/4/03klp03-210052_mr.jpg)
ఆస్పత్రి గేటు వద్ద బాధిత కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment