మహబూబ్‌నగర్: జిల్లాలోని పోలీసులు నిజాం కాలంలోని రజాకార్లలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మండిపడ్డారు.30 ఏళ్లుగా తనవెంటే ఉన్న నాయకుడు కృష్ణారెడ్డిని దొంగను చూసినట్టు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఎవరైనా తప్పు చేస్తే అందుకు శిక్ష అనుభవించాల్సిందేనని, అయితే పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని అన్నారు. వ్యక్తులు తప్పు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పారు. అంతేకాని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడం అమానుషమన్నారు. మొదటగా ఎమ్మెల్యేకు సంబంధించిన పీఏ సోషల్ మీడియాలో తనను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టాడని చెప్పారు.
దీనిపై స్పందించిన కృష్ణారెడ్డిపై ఎస్సై చేయి చేసుకున్నాడన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు పెట్టకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చూడలేదని చెప్పారు. నాగం జనార్దన్‌రెడ్డితోనూ తనకు 20 ఏళ్ల పాటు వైరం కొనసాగినా ఏనాడూ తిట్టుకోలేదని వివరించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో సగం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కౌన్సిలర్లుగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడని చెప్పారు.
వారంతా ప్రజల భూములపై పడ్డారని విమర్శించారు. ఇటీవల వట్టెంలో ఎమ్మెల్యేపై ప్రజలు తిరగబడ్డారన్నారు. తన అనుచరులు, కార్యకర్తలపై కక్షగడితే తానే స్వయంగా పోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అరాచకాలకు ప్రజలే ఓటు ద్వారా బుద్ధిచెబుతారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, కావలి శ్రీను, తిరుపతయ్య, రాంచందర్ పాల్గొన్నారు.
పోలీసులే బీఆర్‌ఎస్‌ను ముంచుతారు
రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థనే బీఆర్‌ఎస్ పార్టీని ముంచుతుందని దామోదర్‌రెడ్డి అన్నారు. వారి అరాచకాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చెప్పినా వాళ్లు సర్దుకునే పరిస్థితుల్లో లేరని చెప్పారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల మెప్పుకోసమే పనిచేస్తున్నారని చెప్పారు.
పోలీసుల తీరుతో చాలామందికి అన్యా యం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చెబితేనే పోలీసులకు పోస్టింగులు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో కొల్లాపూర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment