మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్: నామినేషన్లు సమర్పించేందుకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉందని, ఈ చివరి రోజుల్లో ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికలపై రిటర్నింగ్, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్‌పై, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీపై ఎక్కువగా దృష్టి సారించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, సీ విజిల్ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా విశ్లేషించాలని, రిటర్నింగ్ అధికారులు తక్షణమే వారి నియోజకవర్గ ఎన్నికల ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. త్వరలో జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రానున్న నేపథ్యంలో నోడల్ అధికారులు అందరూ వారి విషయాలకు సంబంధించి రిజిష్టర్లు, రికార్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను నామినేషన్ల చివరి తేదీ నుంచి పోలింగ్‌కు ఐదురోజుల ముందు వరకు పంపిణీ చేయాలని, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ జాగ్రత్తగా చేపట్టాలని కోరారు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైనా 15 మందికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే అదనపు బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో భాగంగా ఫాం– 12 ఇచ్చి మళ్లీ సేకరించిన వివరాలను తక్షణమే సమర్పించాలని, ముఖ్యంగా హోం ఓటింగ్‌పై డీఎంహెచ్‌ఓ, జిల్లా సంక్షేమ అధికారి, డీఆర్‌డీఓలు దృష్టిసారించాలని చెప్పారు.
ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ డేటా బేస్ తయారు చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇతర సిబ్బందికి సంబంధించిన డేటా బేస్‌ను కూడా సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు సీ విజిల్, సువిధ ఇతర ఫిర్యాదులను పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఈ నెల 30న జరిగే పోలింగ్‌పై రూపొందించిన ‘నవంబర్ 30’ స్టిక్కర్లను ఆవిష్కరించారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు మోహన్‌రావు, అనిల్‌కుమార్, నటరాజ్, ఏఎస్పీ రాములు, డీఆర్‌ఓ రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment