ముగిసిన ‘స్వచ్ఛత హీ సేవ’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో గత నెల 17 నుంచి కొనసాగిన ‘స్వచ్ఛత హీ సేవ’ బుధవారంతో ముగిసింది. చివరి రోజు బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రమదానం నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 50 కిలోల చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమంలో చేపట్టిన వివిధ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మెప్మా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లకే తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, రవీందర్‌రెడ్డి, వజ్రకుమార్‌కుమార్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ 15 రోజులలో చెత్తను సేకరించడం, పట్టణ పరిశుభ్రతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. జిల్లా ప్రధాన స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలైన బస్టాండు, రైల్వే స్టేషన్, పర్యాటక ప్రాంతం పిల్లలమర్రిలోనూ చెత్తను సేకరించి, ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment