అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
ఆత్మకూర్: బంధువు అంత్యక్రియల కోసం బయలుదేరాడు.. ఆ కార్యక్రమంలో పాల్గొనకముందే విగతజీవిగా మిగిలాడు ఓ వ్యక్తి.. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాలు.. మదనాపురం మండల కేంద్రానికి చెందిన ఎండీ సుల్తాన్(75) రైస్‌మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మండలంలోని కత్తేపల్లి గ్రామంలో తమ బంధువు మృతిచెందడంతో అంత్యక్రియల కోసం సుల్తాన్ మదనాపురం నుంచి స్కూటర్‌పై బయలుదేరాడు. ఆత్మకూర్ శివారులోని చెరువు సమీపంలో కొత్తకోట వైపు రోడ్డుపై అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సుల్తాన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి 108, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని అతడిని ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. టిప్పర్ రాయచూర్‌కు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వివాహిత బలవన్మరణం
ఉండవెల్లి: కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన మధుబాబు, కర్నూల్ జిల్లా బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన స్వాతి(20)కి రెండేళ్ల క్రితం పైళ్లెంది. వారికి 14 నెలల కొడుకు ఉన్నాడు. కొద్దినెలల నుంచి స్వాతి కడుపునొప్పితో బాధపడుతుండేది. ఈనెల 20వ తేదీన కూడా ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం కడుపునొప్పి భరించలేక స్వాతి ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన చుట్టూపక్కల వారు భర్తకు సమాచారం ఇచ్చారు. మధుబాబు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను అక్కడికి చేరుకొని తలుపులు బద్దలుకొట్టి ఉరేసుకున్న భార్యను చూసి బోరున విలపించాడు. భర్త మధుబాబు పుట్టిన రోజునే భార్య మృత్యువాత పడింది. మృతురాలి తల్లి మలేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందినట్లు ఎస్సై గోవర్దన్ శుక్రవారం తెలిపారు. అచ్చంపేటకు చెందిన మదర్‌బీ (58) గురువారం మధ్యాహ్నం నాగర్కర్నూల్కి ఆర్టీసీ బస్సులో వచ్చింది. రవీంద్రటాకీస్ చౌరస్తా వద్ద బస్సు నుంచి దిగుతూ కిందపడింది. ఆమెకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి..
నారాయణపేట: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని అభంగాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అభంగాపూర్ గ్రామానికి చెందిన భీమప్ప(30) ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏబీ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్లాడు. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు.
రైలు కిందపడి
మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట రైల్వేగేట్ సమీపంలో శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(35) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
అచ్చంపేట: మండలంలోని నడింపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. అచ్చంపేట వలపట్ల కాలనీకి చెందిన మీసాల వినోద్‌కుమార్ (29) హాజీపూర్ నుంచి బైక్‌పై పట్టణానికి వస్తూ.. నడింపల్లి వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టాడు. అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment