సీఎం పర్యటనకు మూడంచెల భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మూడు అంచెల భద్రతతో సభ ప్రాంగణం పూర్తిగా నిఘా నీడలో ఉండనుంది. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సమీపంలో ఈ నెల 30న నిర్వహించే సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో 2 వేల మందితో భారీ పోలీస్ భద్రత కల్పిస్తున్నారు. మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి పూర్తి బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఎప్పటికప్పుడు ఐజీ పోలీస్ ఉన్నతాధికారులను సమన్వయం చేస్తూ సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం పర్యటన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించారు. మొత్తం రెండు వేల మంది పోలీస్ సిబ్బందిలో ఆరుగురు ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు, 58 మంది ఎస్‌ఐలు, 91 మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 700 మంది కానిస్టేబుళ్లు, 139 మంది మహిళా, 174 మంది పురుష హోంగార్డులకు విధులు కేటాయించారు. ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న ఉన్నతాధికారులకు బందోబస్తు కోసం విధులు కేటాయించారు. దీంతో పాటు ఎనిమిది రోప్ పార్టీలు, ఎనిమిది స్పెషల్ పార్టీలు, ఐదు సీపీటీ బృందాలు, 40 మంది గ్రేహౌండ్స్ పోలీస్ బలగాలు బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు..
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కేవలం ట్రాఫిక్ మళ్లించేందుకు 267 మందిని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల నుంచి రప్పించారు. ఇందులో ఇద్దరు డీసీపీలు, ఏసీపీలు ముగ్గురు, సీఐలు ఏడుగురు, ఎస్‌ఐలు 27, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 37, కానిస్టేబుళ్లు 199 మందిని ప్రత్యేకంగా కేటాయించారు. వీరు జాతీయ రహదారితో పాటు మహబూబ్‌నగర్, భూత్పూర్ రోడ్డులో ట్రాఫిక్ డైవర్షన్ విధులు నిర్వహించనున్నారు.
2 వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు
ప్రత్యేకంగా ట్రాఫిక్ మళ్లింపు కోసం 267 మంది కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment