కొల్లాపూర్ అంటే ప్రత్యేక అభిమానం
కొల్లాపూర్: ‘మా తాతయ్య కొల్లాపూర్‌లోనే ఉద్యోగం చేశారు.. మా అమ్మ, మేనమామ ఆర్‌ఐడీ పాఠశాలలోనే ఒక సంవత్సరం పాటు చదువుకున్నారు. సింగోటం జాతరకు వెళ్లి అక్కడ లక్ష్మీనర్సింహస్వామికి మొక్కులు తీర్చుకున్న విషయాలు కూడా నాకు గుర్తున్నాయి. కొల్లాపూర్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ వేడుకలకు రావడం సంతోషంగా ఉంది’ అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన ఆర్‌ఐడీ స్వర్ణోత్సవ వేడుకలకు గురువారం రెండోరోజు ఆయన హాజరయ్యారు. ముందుగా ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థులతోపాటు, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆర్‌ఐడీ పాఠశాలలో చదువుకున్న వాళ్లు ఎంతో గొప్పగా ఎదిగారని, రామేశ్వర్‌రావు వంటి పారిశ్రామికవేత్తలు, కృష్ణారావు లాంటి రాజకీయ నాయకులు ఇక్కడే చదువుకున్నారని పేర్కొన్నారు. దాదాపుగా 14 యూనివర్సిటీలకు ఆర్‌ఐడీ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేశారని, ఇది గొప్ప విషయమని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. కొల్లాపూర్ యువత పారిశ్రామిక వేత్తలుగా, ప్రొఫెసర్లు, డాక్టర్లుగా, సినీ నటులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఆర్‌ఐడీ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు తిరుపాలు, వెంకట్‌దాసు రూపొందించిన పాటల సీడీలను ఆవిష్కరించారు. యువకులు, విద్యార్థులతో సెల్ఫీలు దిగి.. సందడిగా గడిపారు.
ప్రముఖుల ప్రసంగాలు..
స్వర్ణోత్సవాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, బిట్స్ పిలానీ వీసీ వలిపె రాంగోపాల్‌రావు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కట్టా జయరాంరెడ్డి ప్రసంగించారు. కొల్లాపూర్ ఖ్యాతిని పెంచేందుకు ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ సురేందర్‌రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొల్లాపూర్‌లో యశోద హాస్పిటల్ అన్ని వసతులతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కవి, రచయిత అందెశ్రీ మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధికి ఈ ఉత్సవాల ద్వారా పూర్వ విద్యార్థులు నడుం బిగించడం సంతోషించదగ్గ అంశమన్నారు.
వండర్ వరల్డ్ రికార్డు..
94 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థులను సంఘటితం చేసి, వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని, ఈ వేడుకలకు 200 మందికిపైగా పూర్వ గురువులతో పాటు, 2 వేల మంది వరకు పూర్వ విద్యార్థులు హాజరుకావడం, మూడు రోజుల పాటు వేడుకల్లో పాల్గొనడం రికార్డు అని వండర్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. వేడుకలు ఏర్పాటు చేసిన ఆర్‌ఐడీ అల్ముని వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సాయిప్రసాద్, కార్యదర్శి కటికనేని మదన్‌మోహన్‌రావుకు వారు రికార్డు పత్రాన్ని అందజేశారు.
సినీ నటుడు విజయ్ దేవరకొండ
రెండోరోజు ఉత్సాహంగా ఆర్‌ఐడీ స్వర్ణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment