ప్రత్యామ్నాయంపై దృష్టిసారించండి
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు పాలకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జడ్చర్ల పట్టణంలో రెండు జాతీయ రహదారులు– 44, 167 వెళ్తున్నాయి. వీటిలో 167వ నంబర్ రహదారి సింహాభాగం మున్సిపాలిటీలోనే వెళ్తుంది. ప్రస్తుతం సిగ్నల్‌గడ్డ వద్ద విస్తరణ పనులు కొనసాగుతుండగా నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ కారణంగా బైపాస్ మార్గం వేయించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కేంద్రం రోడ్డు, రవాణాశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. అయితే బైపాస్ మంజూరై భూసేకరణ జరిగే వరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే విస్తరణ పనులు పూర్తికావడానికి ఏడాది పట్టవచ్చు. ఈ రెండింటి కారణంగా మున్సిపాలిటీలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా కావేరమ్మపేట నుంచి ప్రభుత్వ ఆస్పత్రి పక్కగా 167వ నంబరు జాతీయరహదారిని కలిపేలా రోడ్డు మార్గం ఉండటంతో దానికి బీటీ వేయాలని ప్రజలు కోరుతున్నారు.
2.5 కి.మీ., రోడ్డు వేస్తే..
జాతీయ రహదారి–44 నుంచి కావేరమ్మపేట చౌరస్తా మీదుగా మదర్సా ముందు నుంచి రైల్వేట్రాక్ దాటుతూ ప్రైవేట్ వెంచర్ల నుంచి జాతీయ రహదారి–167ని కలిపేలా 2.5 కి.మీ., రోడ్డు వేస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకు రైల్వే శాఖ అనుమతి సైతం అవసరం ఉండదు. రైల్వేట్రాక్ కింది వాహనాలు ఒకవైపు వెళ్లేలా మరో వైపు వచ్చేలా ఇదివరకే నిర్మాణం జరిగి ఉంది. ఈ మార్గం మొత్తం 40 అడుగుల విస్తీర్ణం ఉండటం వల్ల కావేరమ్మపేట, జడ్చర్ల రైతులకు సైతం మేలు జరుగుతుంది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో బీటీ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా మంజూరుకు నోచుకోలేదు. ఆ ఫైల్ ప్రస్తుతం సీఎం పేషీలో ఉన్నట్లు తెలుస్తుంది.
రోడ్డు మార్గం ఏర్పాటుతో
ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment