లక్ష డప్పులతో ప్రభుత్వాన్ని కదిలిద్దాం
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని శాంతిభద్రతల సమస్యగా తీసుకువచ్చి.. అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని మాల ప్రజాప్రతినిధులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘లక్ష డప్పులు– వేల గొంతులు’ భారీ ఆయుధ ప్రదర్శన మహాసభకు సంబంధించి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా సన్నాహక సమావేశాన్ని జడ్చర్లలోని చంద్రగార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయని.. సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చిందన్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ చేస్తామని ప్రకటించినా.. అమలు చేయకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న మాలలే కారణమన్నారు. నాగర్‌కర్నూల్ సభలో వర్గీకరణను అడ్డుకుంటామని మీసాలు మెలేశారని, సింహగర్జన సభలో తొడ కొట్టారని గుర్తుచేశారు. అవసరమైతే మందకృష్ణను చంపైనా వర్గీకరణను అడ్డుకుంటామని వారు ప్రకటిస్తున్నారంటే.. కేవలం మాదిగలను రెచ్చగొట్టి ఘర్షణలకు దారి తీసేందుకే యత్నిస్తున్నారని అన్నారు. వారి మాయలో పడొద్దన్నారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని.. అలాగని ఏ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. 30 ఏళ్లుగా నల్లకండువా వేసుకుని ఉన్నానన్నారు. తనకు పదవులు ఇస్తానని చెప్పినా తీసుకోలేదని గుర్తుచేశారు. వర్గీకరణ ఫలితాలు మాదిగ బిడ్డలకు దక్కాలంటే తప్పనిసరిగా డప్పు సంకనేసుకుని రావాలని కోరారు. లక్ష డప్పులను మోగించి కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక తీసుకువద్దామని పిలుపునిచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు కొడుతూ కాలినకడన చంద్ర గార్డెన్‌కు చేరుకున్నారు. సదస్సులో ఎమ్మార్పీఎస్ నాయకులు జంగయ్యమాదిగ, రొట్టె శేఖర్, పోల శివన్న, దత్తు, శేఖర్, యాదయ్య, నాగరాజు, సువార్త, బాలయ్య, సురేష్, బాల్‌రాజు, శశికిరణ్, నడిమింటి శ్రీను పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చాలని చూస్తున్నారు..
‘లక్ష డప్పులు – వేల గొంతులు’
సన్నాహక సభలో మందకృష్ణమాదిగ
Comments
Please login to add a commentAdd a comment