క్వారీలో జంగల్ సఫారీ
● వన్యప్రాణుల సందర్శనకు ‘గాంధారీ ఖిల్లా సఫారీ’ ● కనువిందు చేయనున్న ప్రకృతి, అడవి అందాలు ● పర్యాటకంగా అభివృద్ధికి అటవీ శాఖ కసరత్తు ● మరో వారంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎత్తయిన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం.. పచ్చని అడవి.. ప క్షుల కిలకిల రావాలు.. అందమైన నీటి కొలనులు.. వెరసి మంచిర్యాల జిల్లాలోని ఎంసీసీ క్వారీ జంగల్ సఫారీకి వేదిక కానుంది. ఇన్నాళ్లూ ఎంసీసీ క్వారీ అంటే హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధి దుర్గాదేవి జాతర గుర్తుకు వచ్చేది. ఇక జంగల్ సఫారీకి ఆహ్వానించనుంది. మరో వారం రోజుల్లో గాంధారి ఖిల్లా సఫారీ ప్రారంభానికి అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలోని పాత మంచిర్యాల అటవీ బీట్ పరిధి హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ శివారులో ఎంసీసీ క్వారీలోని అటవీ ప్రాంతంలో సఫారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పాతమంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీ బీట్ అడవుల పరిధిలో సఫారీ పర్యటన సాగనుంది. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాశ్ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎస్‌ఓ అతావుల్లా, ఎఫ్‌బీలో రాజేందర్, సంతోష్ గురువారం సఫారీకి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. సఫారీ రూట్ మ్యాప్‌తోపాటు అడవిలో ఉన్న మంచెలు, నీటికుంటలు, వ్యూ పాయింట్లపై మరోసారి సమీక్షించి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్‌శ్‌సింగ్, ఎఫ్‌డీఓ సర్వేశ్వర్ పత్యక్ష పర్యవేక్షణలో మరో వారం రోజుల్లో సఫారీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మంచెల ఏర్పాటు
జంగల్ సఫారీలో భాగంగా పర్యాటకులు అడవి అందాలు, వన్యప్రాణులను వీక్షించేందుకు ఆరు మంచెలు ఏర్పాటు చేశారు. వణ్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఐదు నీటికుంటలు ఏర్పాటు చేసి వాటిలో నీరు నింపేందుకు సోలార్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్‌తో బోర్ వేయించారు. 20 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్, ట్రాక్ మధ్యలో 24 మీటర్ల వెడల్పుతో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టారు. పనుల కోసం రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. క్వారీ నుంచి గాంధారీ ఖిల్లా, నీటికుంటలు, అటవీ జంతువులు, అటవీ అందాలను వీక్షించవచ్చు. జంగల్ సఫారీకి ఒక్కో టిప్పుకు రూ.2 వేల వరకు రుసుం ఉండనున్నట్లు సమాచారం.
వన్యప్రాణులు..
అటవీ ప్రాంతంలో శాఖాహార, మాంసాహార జంతువులు, వివిధ రకాల వణ్యప్రాణులు ఉన్నాయి. పెద్దపులి, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, దుప్పులు, మెఖములు, చుక్కల దుప్పులు, అడవి కుక్కలు, నక్కలు, సాంబర్‌లు, అడవి పందులు, నెమళ్లు ఉన్నాయని అటవీ అధికారులు తెలిపారు. క్వారీకి వెళ్లే మార్గంలో ఎత్తయిన గుట్టల నుంచి తీసిన రహదారి, మూలమలుపులు, పచ్చని చెట్లు అలరిస్తాయి. ఎంసీసీ పరిశ్రమ గుట్టలపై ఉన్న చెట్లలో పార్కుల నిర్మాణం చేపట్టి పిక్నిక్ స్పాట్‌గా మార్చింది. ఆదివారం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి సేద తీరుతారు. ఇప్పటికే జిల్లాలోని జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో జంగల్ సఫారీకి పర్యాటకులు వస్తుంటారు.
కెమెరాకు చిక్కిన పులి..
ఇటీవల సఫారీ ఏర్పాట్లలో భాగంగా రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కెమెరాకు అడవిలోకి వెళ్తున్న పులి చిక్కింది. హాజీపూర్ మండల పరిధిలోని అటవీ శివారుల ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరాకు చిక్కిన పులి చిత్రాలను అటవీ అధికారులు గురువారం విడుదల చేశారు.
వారంలో ప్రారంభం
అడవి అందాలు, వణ్యప్రాణులతోపాటు చారిత్రాత్మక ప్రాంతమైన గాంధారీ ఖిల్లాను వీక్షించేందుకు క్వారీలోని అడవుల్లో 20 కిలోమీటర్ల మేర జంగల్ సఫారీ ఏర్పాటు చేస్తున్నాం. వారం రోజుల్లో ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. నిత్యం 50 మంది కూలీలు, యంత్రాల సహాయంతో సఫారీ ట్రాక్ పూర్తి చేయించగా అటవీలో ఎలాంటి చెత్త లేకుండా పనులు పూర్తి చేయిస్తున్నాం.
– అత్తె సుభాష్, అటవీ రేంజ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment