ప్రతిభావంతులకు ‘ఉపకార’ం
● 24న ఎన్‌ఎంఎంఎస్ అర్హత పరీక్ష ● పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
దండేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నెల 24న జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని, డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ప్రతియేటా ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులు అర్హత పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రతిభ కనబర్చి ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతీ నెల రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందుతుంది. 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి పరీక్ష రాసేందుకు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 923 మంది 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లా నుంచి 57 మంది ఎంపికయ్యారు.
జిల్లాలోని పరీక్ష కేంద్రాలు
మంచిర్యాలఅర్బన్: ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహణకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బెల్లంపల్లి బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి యాదయ్య తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రణాళికతో చదవాలి
నేను 2022–23లో ఎన్‌ఎంఎస్ పరీక్ష రాసి ప్రతిభ కనబరిచి ఎంపికై ఉపకార వేతనం పొందుతున్నాను. పరీక్ష రాసేవాళ్లు ప్రణాళికతో సిద్ధం కావాలి. అలా అయితేనే ఎంపికవుతాం. మెంటల్ ఎబిలిటీ పేపర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. గత ప్రశ్నపత్రాలతో సాధన చేయాలి.
– మ్యాన అక్షయ, 10వ తరగతి,
జెడ్పీ ఉన్నత పాఠశాల, వెల్గనూర్
Comments
Please login to add a commentAdd a comment