● నస్పూర్ మున్సిపాల్టీ, హాజీపూర్
మండలంలోని గ్రామాల విలీనం
● భవిష్యత్ దృష్ట్యా విస్తరణకు ప్రతిపాదనలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జోడిస్తూ నిధులు సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. తద్వారా మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే కొత్త మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఏర్పాటు వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల విస్తరణకు ఉత్తర్వులు చేసింది. కొత్త మున్సిపల్ చట్టం–2019 ప్రకారం గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను కార్పొరేషన్‌గా మార్చేందుకు పావులు కదులుతున్నట్లు సమాచారం. నస్పూర్ మున్సిపాల్టీతోపాటు మంచిర్యాల పట్టణాన్ని ఆనుకుని ఉన్న హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్, నర్సింగాపూర్ గ్రామాలను మంచిర్యాలలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఈ విలీనంతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జనాభా దాదాపు మూడు లక్షల వరకు చేరనుంది. పంచాయతీలను విలీనం చేసేలా పురపాలక శాఖకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలోనే పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ జరిపేలా చూడనున్నట్లు తెలుస్తోంది.
విస్తరణ..
మంచిర్యాల పట్టణాభివృద్ధి సంస్థ(అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) విస్తరణ ప్రక్రియ అధికారికంగా తుది దశకు చేరింది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు అభివృద్ధి, భవిష్యత్ దృష్ట్యా విస్తరణ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపినట్లయ్యింది. ఐదు గ్రామాలు, నస్పూర్ మున్సిపాలిటీ విలీనంతో మున్సిపల్ కార్పొరేషన్ 360 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనుంది. పంచాయతీల విలీనానికి అనుకూల తీర్మానాలు చేసేలా పంచాయతీలకు కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ కానున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు విస్తరణపై జరిగిన చర్చలో పాల్గొని విస్తృత సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కార్పొరేషన్‌కు సంబంధించి పలు నివేదికలు సంబంధిత శాఖకు చేరగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సీఎం కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment