కొరమీనుకు కేరాఫ్‌గా మంచిర్యాల
● ఎల్లంపల్లి పాజెక్టు వద్ద సంరక్షణ, పెంపకం కేంద్రం ● 30 ఎకరాల్లో రూ. 15 కోట్లతో ఏర్పాటు ● మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రాష్ట్ర చేప కొరమీను(కొర్రమట్ట, బొమ్మె)కు మంచిర్యాల జిల్లా కేరాఫ్‌గా మారుతుందని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి వద్ద కొరమీను సంరక్షణ, పెంపకం కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు ప్రతిపాదిత స్థలాన్ని రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి స్థల పరిశీలన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 30 ఎకరాల్లో రూ.15 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొరమీను జాతిని కాపాడటంతోపాటు సంఖ్యను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర అవసరాలను తీర్చి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తయ్యే చేప పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. చేపల పెంపకం కోసం ఫిష్‌పాండ్‌లు ఏర్పాటు చేసుకుని ఉపాధితోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. ఎల్లంపల్లి వద్ద 85 ఎకరాల స్థలాన్ని మత్స్య శాఖకు అప్పగించగా, అందులో 30 ఎకరారు కొరమీను పెంపకం, సంరక్షణ ప్రాజెకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మిగతా 55 ఎకరాల్లో అక్వా కల్చర్‌ఫాం కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల చేపల పెంపకం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ వై.సాంబశివరావు, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, సర్వేయర్ ఆశిష్, ఆర్‌ఐ ప్రభు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, జిల్లా అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment