ఆలయ భూములకు జియో ట్యాగింగ్
సమాచారం అంతా ఆన్‌లైన్‌లో నమోదు
● ఆలయ స్వరూపంతోపాటు ఆస్తుల వివరాలు నమోదు ● కసరత్తు ప్రారంభించిన దేవాదాయ అధికారులు ● ఆలయాలను గుర్తించడం ఇక సులభతరం
సంగారెడ్డి జోన్: జిల్లాలోని దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగానే ఆలయ భూములతోపాటు ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఆలయాల పూర్తి సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాలన్నింటినీ సులభంగా గుర్తించేలా భూములు, ఆస్తుల వివరాలు తక్షణమే తెలిసే విధంగా చర్యలు చేపట్టింది. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకుంటూ ఆధునిక విధానంవైపు అడుగులు వేస్తూ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్య పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలున్నాయి. ఆయా ఆలయాలకు వచ్చే సంవత్సర ఆదాయాన్ని బట్టి ఆలయాలను విభజించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 6(ఏ) కేటగిరీలో 13, 6(బీ) కేటగిరీలో 12, 6(సీ) కేటగిరీలో 10, 6(డీ) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలు ఉన్నాయి. ఆయా జిల్లాలోని ఆలయాల స్వరూపంతోపాటు భూముల అన్ని రకా ల వివరాలను గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్)కు అనుసంధానం చేయనున్నారు. అందులో భాగంగా ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నాయా....ఉంటే ఏయే సర్వే నంబర్లలో ఉన్నాయి? ఆలయ సరిహద్దులు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.
జిల్లాలు, కేటగిరీల వారీగా ఉమ్మడి మెదక్ జిల్లా ఆలయాల వివరాలు
కేటగిరీ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట
6(ఎ) 2 4 7
6(బీ) 3 3 6
6(సీ) 2 5 3
6(డీ) 0 1 0
మొత్తం 7 13 16
జిల్లాల వారీగా ధూపదీప నైవేద్య పథకం ద్వారా మంజూరు చేయబడ్డ ఆలయాలు
మెదక్ సంగారెడ్డి సిద్దిపేట
మొదటి దశ 43 31 144
రెండవ దశ 43 91 142
మూడవ దశ 93 181 171
మొత్తం 179 303 457
త్వరలో అప్‌లోడ్
దేవాదాయ శాఖ అధికారులు జీపీఎస్ మ్యాప్ కెమేరా యాప్‌లో ఫొటోలు తీసి అక్షాంశాలు, రేఖాంశాలు, లొకేషన్ ఆధారంగా ఆలయాలకు సంబంధించిన ఆస్తులు భూముల వివరాలతో పాటు ఫోటోలను సేకరించి ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆలయ భూములను సర్వే చేసి, మార్కింగ్ వేసి అప్‌లోడ్ చేయనున్నారు. అనంతరం సేకరించిన వివరాలు పరిశీలించివాటికి జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా గూగుల్‌లో అందుబాటులో ఉండే విధంగా నమోదు చేయనున్నారు. ఒక్క క్లిక్‌తో ఇంటర్‌నెట్ ద్వారా ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఫొటోలతో సహా తెలుకునేందుకు వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment