‘ప్రజావాణి’కి ప్రాధాన్యమివ్వాలి
డీఆర్‌ఓ భుజంగరావు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి వినతులను అధికారులు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగించాలని డీఆర్‌ఓ భుజంగరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. అర్జీలకు తక్షణ పరి ష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజావాణికి భూ సమస్యలపై 35, ఇందిరమ్మ ఇళ్ల కోసం 12, పెన్షన్ల కోసం 3, ఇతర సమస్యలపై 35 వినతులు వచ్చాయి.
‘పర్యాటక ప్రాంతంగా
తీర్చిదిద్దుతాం’
నర్సాపూర్: మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎస్‌ఐ చర్చి, మెదక్ ఖిల్లాతో పాటు ఏడుపాయలను అభివృద్ధి చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని చెప్పారు. నిధుల మంజూరుకు సీఎం అంగీకరించారని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయని అభివృద్ధిని తాము ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. ఏడుపాయల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలని బీజేపీ నాయకులను కలిసి కోరుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి ఏడుపాయల దుర్గామాత ఆలయానికి వస్తున్నారని, జిల్లాలోని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని కోరారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, పట్టణ అధ్యక్షుడు చిన్న అంజిగౌడ్ తదితరులు ఉన్నారు.
ఉపాధి కూలీల
సంతకాలు ఫోర్జరీ
టేక్మాల్(మెదక్): కూలీల సంతకాలు ఫోర్జరీ చేసి బినామీ పేర్లపై డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు డీఆర్‌డీఓ రంగాచారి తెలిపారు. మండలంలో 2023– 24 సంవత్సరంలో రూ. 3.77 కోట్లు, పంచాయతీరాజ్‌లో రూ. 2.69 కోట్ల పనులకు సోమవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని ఎల్లుపేటలో టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మేకలు, పశువుల షెడ్డుల నిర్మాణంలో వెటర్నరీ డాక్టర్ సంతకం లేకుండానే బిల్లులు తీసుకోవడం, ఆశావర్కర్, కార్మికులు, లైన్‌మెన్లు పనిచేస్తున్నట్లుగా కూలీలు తీసుకుంటున్నట్లు రికార్డులు సృష్టించినట్లు చెప్పారు. సామాజిక తనిఖీలో రికవరీ రూ. 5.25 లక్షలు, రూ. 47 వేల జరిమానా విధించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీహరి, నాణ్యత పరిశీలకురాలు జ్యోతి, ఎంపీడీఓ విఠల్, ఎంపీఓ రియాజొద్దీన్, పీఆర్‌ఏఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment