మాకు మాఫీ ఏదీ..?
● మేనేజర్‌తో రైతుల వాగ్వాదం
● బ్యాంకు ఎదుట నిరసన
శివ్వంపేట(నర్సాపూర్): రుణమాఫీ కాకపోవడంతో రైతులు శుక్రవారం బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శివ్వంపేట మండల పరిఽధి గుండ్లపల్లికి చెందిన పలువురు రైతులు దొంతిలోని యూనియన్ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. అయితే.. తమకు నేటికీ రుణమాఫీ కాలేదని రైతులు సదానందం,వెంకటేశంగౌడ్, సత్యగౌడ్, సత్తయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు ఆరోపించారు. పింఛన్ డబ్బుల కోసం బ్యాంక్‌కు వస్తే పంట రుణం బకాయి కింద ఖాతాను హోల్డ్‌లో పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు చెబుతున్నప్పటికీ అమలులోకి రాలేదని వాపోయారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ అమృతపాఠక్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉన్నత చదువుతోనే గుర్తింపు
ఐసీడీఎస్ సీడీపీఓ హేమభార్గవి
శివ్వంపేట(నర్సాపూర్): ఉన్నత చదువుతోనే ఆడపిల్లలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఐసీడీఎస్ సీడీపీఓ హేమభార్గవి, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపాల్ మంజుల అన్నారు. మండల పరిధి గూడూర్ కస్తూర్బా గాంధీ వసతిగృహంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు ఆత్మస్థైర్యంలో అనుకున్న లక్ష్యం వైపు ముందుకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఆడ పిల్లల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు సంతోష, వసుమతి, తదితరులు ఉన్నారు.
ప్రతి కుటుంబానికి
సంక్షేమ ఫలాలు
సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
తూప్రాన్: ప్రజా పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతితో కలిసి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహం, 12వ వార్డులో బటర్‌ఫ్లై లైట్లు, 10వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కృష్ణ, విశ్వరాజ్, నాగులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
హింసాత్మక ఘటనలను
ఉపేక్షించం: ఐజీ
పటాన్‌చెరు టౌన్: ఎట్టిపరిస్థితుల్లోనూ హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ వినాయక్‌రెడ్డితో కలసి శుక్రవారం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ...పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేసులో 43 మందిపై కేసు నమోదు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ రాజీ పడదని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment