క్లాసిక్‌ సినిమాలకు కేరాఫ్‌ ‘మూబి’ | MUBI, Becoming Pride | Sakshi
Sakshi News home page

క్లాసిక్‌ సినిమాలకు కేరాఫ్‌ ‘మూబి’

Published Tue, Aug 25 2020 4:44 PM | Last Updated on Tue, Aug 25 2020 5:50 PM

MUBI, Becoming Pride - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూత పడడంతో ‘వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌’లు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నాయి. థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమాలను ఈ సర్వీసులు నేరుగా వినియోగదారుల ఇంట్లోకి, గదుల్లోకి తీసుకొచ్చాయి. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, టేబుల్‌ టాప్స్, ఆఖరికి సెల్‌ఫోన్‌ల ద్వారా కూడా వినియోగదారులు కోరుకున్న సినిమాలను చూసే భాగ్యాన్ని ఈ సర్వీలు అందుబాటులోకి తెచ్చాయి.

భారత్‌లో ప్రధానంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, హాట్‌స్టార్, జీ5, సోనిఎల్‌ఐవీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌లు ‘వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌’ ద్వారా సినిమాలను, వెబ్‌ సిరీస్‌ను, సీరియళ్లను ప్రసారం చేస్తున్నాయి. ఈ కోవలోకి సరికొత్తగా ‘మూబి (ఎంయూబీఐ)’ వచ్చి చేరింది. వాస్తవానికి ఈ ‘మూబి’ని 2007లోనే ‘ఎఫే కరాకెల్‌’ సంస్థ ప్రారంభించి తన సేవలను ప్రపంచంలోని 190 దేశాలకు విస్తరించింది. భారత్‌లోకి 2019, నవంబర్‌లోకి అడుగుపెట్టింది. (‘విష ప్రయోగం వల్లే సుశాంత్‌ మృతి చెందాడు’)

ఇది బాలీవుడ్‌ బ్లాక్‌ బ్లాస్టర్లకు పరిమితం కాకుండా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న, అందుకుంటున్న ‘మరో సినిమా’ చిత్రాలకు ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పాతతరం మెచ్చిన, మెచ్చుకునే చిత్రాలను అన్ని తరాలకు అందుబాటులోకి తెచ్చింది. అనార్కలీ, ప్యాసా, దో బిఘా జమీన్, మధుమతి, బూట్‌ పాలిష్, బేజూ బావ్‌రా, నీచే నగర్‌ లాంటి చిత్రాలతోపాటు, ఆవారా, శ్రీ420 లాంటి రాజ్‌ కపూర్‌ చిత్రాలు, హృషికేశ్‌ ముఖర్జీ నిర్మించిన ‘గోల్‌మాల్‌’, సత్యజిత్‌ రాయ్‌ నిర్మించిన ‘పథేర్‌ పాంచాలి’ లాంటి చిత్రాలతోపాటు మృణాల్‌ సేన్‌ చిత్రాలను కూడా ఈ మూబి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. విమర్శకులకు కూడా అంతగా పరిచయంలేని అమిత్‌ దత్తా డాక్యుమెంటరీలను కూడా ఇది అందుబాటులోకి తెస్తోంది.


కుల వివక్షపై అరుణ్‌ కౌల్‌ తీసిన దిక్షా (1991), అర్బన్‌ డ్రామాపై గిరీశ్‌ కాసర్‌వల్లీ తీసిన ‘ఏక్‌ ఘర్‌ (1991), వలస కార్మికుల గుర్తింపు పత్రాలకు సంబంధించిన ఇతివృత్తంతో కమల్‌ కేఎం తీసిన ఐడీ (2013) చిత్రాలతోపాటు మలయాళంలో వేణు తీసిన పరిణామం (2003), సీపీ పద్మకుమార్‌ తీసిన సమ్మోహనం (1994) చిత్రాలను ‘మూబి’ సెప్టెంబర్‌ నెలలో ప్రసారం చేస్తోంది. పీకే నాయర్‌పై శివేంద్ర సింగ్‌ దుంగార్పూర్‌ తీసిన ‘సెల్యులాయిడ్‌ మేన్‌ (2012)’ డాక్యుమెంటరీని, పరీక్షల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటోన్న విద్యార్థులపై అభయ్‌ కుమార్‌ తీసిన ‘ప్లేస్‌బో (2014) డాక్యుమెంటరీని ఈ సెప్టెంబర్‌లోనే ప్రసారం చేస్తోంది. బాలీవుడ్‌లో ‘మరో సినిమా’ కేటగిరీ కిందకు వచ్చే ఈ పాత సినిమాల్లో అనేకం మనకు ‘యూట్యూబ్‌’లో  కనిపిస్తాయి. అయితే అవి ఒరిజల్స్‌ కాకపోవడం వల్ల నాణ్యతతో లేవు. పైగా మూబిలో ప్రాసరం చేస్తున్న చిత్రాలు ‘క్యూరేట్‌’ చేసినవి. ప్రతి పాత సినిమా చూడాలంటే అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఏ కేటగిరీలో ఏ సినిమా చూడడం మంచిదో, ఏ దర్శకుడు, ఏ సమాజిక దృక్పథంతో సినిమా తీశారో అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలను ఎంపిక చేస్తున్నారు ‘మూబి కాంటెన్ట్‌ డైరెక్టర్‌’ స్వేత్లానా నౌదియాల్‌. మొదట్లో మనికౌల్, శ్యామ్‌ బెనగల్, సయీద్‌ మీర్జా సినిమాలకు పరిమితమైన ‘మూబి’ స్వేత్లానా రాకతో రూపురేఖలు మార్చుకుంది.

బాలీవుడ్‌ తరహాలో హాలీవుడ్‌ క్లాసిక్స్‌ను కూడా మూబీ ప్రసారం చేస్తోంది. నచ్చిన లేదా ఎంపిక చేసిన అన్ని చిత్రాల రైట్స్‌ను తీసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, అందుకని తమ మూబి నెల రోజుల నుంచి 18 నెలలపాటు చిత్రాల రైట్స్‌ను కొనుగోలు చేస్తోందని ఆమె చెప్పారు. (మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement