ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం.
తెలుగు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది.
ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ...
‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు.
దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు.
గర్వంగా ఉంది
– రాజమౌళి
‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి.
కొత్త రూల్
ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్‌కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట.
ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్.
ఆ నలుగురికీ గౌరవం
‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్‌లతో పాటు సన్‌డాన్స్
ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్‌మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment