Bollywood And Tollywood Actors Injured On Film Sets, Deets Inside - Sakshi
Sakshi News home page

ఇటీవల యాక్షన్‌ షూట్‌లో దెబ్బతిన్న హీరోస్‌ వీళ్లే..

Published Wed, Jul 5 2023 3:42 AM | Last Updated on Wed, Jul 5 2023 1:20 PM

Stars Injured on Set in Action scenes shoots - Sakshi

స్క్రీన్‌పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్‌ సీన్స్‌ చేసేటప్పుడు స్టార్స్‌కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్‌కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్‌ షూట్‌లో పరేషాన్‌ అయిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

టైగర్‌కి గాయం
ఐదు కేజీల డంబెల్‌ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్‌ ఖాన్‌కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్‌ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్‌ సీన్‌ చేస్తుండగా సల్మాన్‌ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్‌ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు సల్మాన్‌. అంతే.. ‘టైగర్‌ (సల్మాన్‌ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్‌ స్పందించారు.

కింగ్‌ ఖాన్‌.. నోస్‌ సర్జరీ
షారుక్‌ ఖాన్‌ని ఆయన ఫ్యాన్స్‌ కింగ్‌ ఖాన్‌ అని పిలుచుకుంటారు. ఈ కింగ్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్‌ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఓ చిత్రం కోసం యాక్షన్‌ సీన్‌ చేస్తూ, గాయపడ్డారు షారుక్‌. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్‌ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్‌ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్‌ టాక్‌.

విక్రమ్‌.. రిస్కీ పోరాటమ్‌
విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్‌. తాజాగా విక్రమ్‌ ఓ కొత్త లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్‌ షూట్‌లో పాల్గొనే ముందు విక్రమ్‌ రిహార్సల్స్‌ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్‌లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది.
 
పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి

మలయాళ పరిశ్రమలో ఓ స్టార్‌ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్‌ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్‌ సీన్‌ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్‌ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని పృథ్వీరాజ్‌కి సూచించారు.
   
వరుణ్‌.. మూడు వారాల విశ్రాంతి

వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్‌’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్‌ సీన్‌ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్‌ సందేశ్‌. ఈ ప్రమాదంలో వరుణ్‌ సందేశ్‌ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్‌కి సూచించారు వైద్యులు. వరుణ్‌ సందేశ్‌ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతానికి వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement