కాంగ్రెస్‌ సర్కార్‌ను నిద్రలేపేందుకే జలదీక్ష | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కార్‌ను నిద్రలేపేందుకే జలదీక్ష

Published Tue, Apr 16 2024 1:20 AM | Last Updated on Tue, Apr 16 2024 1:20 AM

జలదీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  - Sakshi

గద్వాల రూరల్‌: నడిగడ్డ ప్రాంత ప్రజల గొంతు తడపడానికి, ఎన్నికల సమయంలో మోసపూరితమైన ఆరు గ్యారెంటీ హామీలిచ్చి నాలుగు నెలలైనా వాటి ఊసు మర్చిపోయి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్‌ సర్కార్‌ను నిద్రలేపడానికి జలదీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీర్‌ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం గద్వాలలో ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తలపెట్టిన ఒకరోజు జలదీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన హరీశ్‌రావు కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే నీటి కరువు వచ్చిందని, ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, సర్కారు దవాఖానాలో మందులు లేవని, కేసీఆర్‌ కిట్లు లేవని మండిపడ్డారు. పంటలు ఎండిపోయి రైతులు విలవిల్లాడుతుంటే మరోవైపు మంత్రులు, ముఖ్యమంత్రి క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతా..

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపిస్తే పార్లమెంటులో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని అన్నారు. బీజేపీ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. రైతుల పంటలు ఎండుతుంటే నేరుగా వెళ్లి వారికి న్యాయం చేయాలంటూ గొంతెత్తిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల ప్రజలు తెలివైన వారని, తమకోసం నిలబడే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించుకున్నారని అన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేసే నాయకుడు అని, ఇప్పుడు నీటిసమస్య వస్తే జలదీక్ష చేసి కాంగ్రెస్‌ సర్కారు మెడలు వంచి నీళ్లను తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారన్నారు.

గొంతెండుతున్నా పట్టించుకోరా..

ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి నాయకులు వచ్చి ఇక్కడ డబ్బులు పంచి కృష్ణమోహన్‌రెడ్డిని ఓడించాలని చూసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ప్రజల గొంతెండుతుంటే ఎందుకు వారితో మాట్లాడి నీరు ఇప్పించలేకపోతున్నార ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు ఓటు వేయాలని అన్నారు. అలాగే, రైతులకు గొడ్డలి పెట్టు వంటి నల్లచట్టాలు తీసుకొచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది ఆ పార్టీయేనని, ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారన్నారు. తనతోపాటు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి ప్రా జెక్టుల వద్ద నిద్రపోయి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తిచేయించామని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 6.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కుతుందున్నారు.

పంటలు ఎండుతుంటే సీఎం, మంత్రులు క్రికెట్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు..

జలదీక్షలో మాజీ మంత్రితన్నీరు హరీశ్‌రావు

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

రాజకీయాలు పక్కన పెట్టి ఆదుకోవాలి

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కనపెట్టి నడిగడ్డ ప్రజల గొంతును తడిపేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్‌ డ్యాం నుంచి 5టీఎంసీల నీటిని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అందుకే తాను జలదీక్ష చేపట్టినట్లు తెలిపారు. నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. దీక్ష చేపట్టి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మె ల్యే విజయుడు, గడ్డం కృష్ణారెడ్డి, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అభిలాష్‌రావ్‌, ప్రతాప్‌గౌడ్‌, నాగిరెడ్డి, శ్రీనివాసులు, విజయ్‌, రాజశేఖర్‌, రాజారెడ్డి, హనుమంతు, గోవిందు, నవీన్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌, కురుమన్న పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement