రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
పెంట్లవెల్లి: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యం సేకరించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్, పెంట్లవెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, జటప్రోల్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం స్థలాన్ని ఆర్డీఓ బన్సీలాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచి వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయాలన్నారు. అలాగే వడ్లలో ఎలాంటి దుమ్ము లేకుండా, తేమశాతం తగు మోతాదులో ఉండేలా ఆరబెట్టుకొని ధాన్యం తీసుకురావాలని సూచించారు. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత ఆధార్ కార్డు, పాసు బుక్, బ్యాంక్ అకౌంట్ వంటివి వెంటనే ధాన్యం కొనుగోలుదారులకు అప్పగించాలని చెప్పారు. ఐకేపీ వారు కూడా తేమ శాతం చూసుకొని ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయంతి, వైస్ ఎంపీపీ భీంరెడ్డి, నాగిరెడ్డి, ఏపీఎం గౌసుద్దీన్, నరేష్‌యాదవ్, శోభ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment