మహిళలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి
నాగర్‌కర్నూల్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలను చేర్పించి.. వారిని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డీపీఎంలు, ఏపీఓలు, ఈసీలు, ఏపీఎంలు, సీసీలు, గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి కోసం విరివిగా రుణాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలని, ఒక ఇంట్లో ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉంటారని, వారిని చూసి ఇతరులు సైతం ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళా శక్తి పథకం లక్ష్యాన్ని వందశాతం నెరవేర్చేలా కృషిచేయాలన్నారు. ప్రతి గ్రామంలోని 18– 60 ఏళ్లలోపు మహిళలందరినీ స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని ఆదేశించారు.
● ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులను పరిశీలించి సామాజిక తనిఖీలను నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను నమోదు ప్రక్రియలను చేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులు, అర్హులందరికీ పనులు కల్పించాలని సూచించారు. నర్సరీలోని మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరతిగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్, ఏపీడీ రాజేశ్వరి, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment