సమష్టి కృషితో మాదకద్రవ్యాలను అరికట్టండి
నాగర్‌కర్నూల్: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మాదక ద్రవ్యాలను అరికట్టాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల నిర్మూలన, ఇంటర్మీడియట్ పరీక్షలు, విద్యార్థుల హాజరు, ఒత్తిడికి గురికాకుండా చదువు కొనసాగింపు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలు, ఇతరత్రా నార్కోటిక్స్‌పై జిల్లావ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కందనూలును మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడానికి అందరూ సహకరించాలన్నారు. ఇంటర్ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, వారికి ఒత్తిడి లేని చదువు అందించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పరిగణలోకి తీసుకోవాలని, చెడు అలవాట్లకు లోనైన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యపరచాలన్నారు. ఆరోగ్య, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తే పరిష్కార మార్గాలు చెబుతారన్నారు. సమావేశంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment