90 రోజుల ప్రణాళిక పక్కాగా అమలుచేయాలి
కందనూలు/తిమ్మాజిపేట/బిజినేపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 90 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ బాలికల, తిమ్మాజిపేట జూనియర్ కళాశాలలతో పాటు బిజినేపల్లి మండలం పాలెం వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కళాశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడంతో పాటు ప్రణాళికా బద్ధంగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించి.. ఈఏపీ సెట్, నీట్, టీటీసీ పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. కళాశాలల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ, ప్రిన్సిపాళ్లు రాణి, అనసూయ, ఆనంద్‌గౌడు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment