భూసేకరణ ప్రక్రియ వేగవంతం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ,నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ఆర్డీఓ, తహసీల్దార్లకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా మర్లపాడు తండా, కేశ్యతండా తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో మ్యుటేషన్, పీఓబీ, సక్సెషన్, కోర్టు కేసులు, టీఎం 33 మాడ్యూల్స్‌ల పరిష్కారంలో వేగం పెంచి సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. ఆయా భూములకు సంబంధించిన పత్రాలతో పాటు ఫీల్డ్ పొజిషన్ నివేదిక తప్పనిసరిగా సమర్పించాలన్నారు. తహసీల్దార్ల లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోద యోగ్యమైన ప్రతి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
సహకార సంఘాల బలోపేతానికి చర్యలు
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సహకార సంస్థల అభివృద్ధికి ప్రణాళికలు, వ్యూహాలను రూపొందించి, సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం దేశంలోని 34 రాష్ట్ర సహకార సంఘాల ద్వారా దాదాపు రూ. 5లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సహకార సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కిసాన్ సమృద్ధి, కామన్ సర్వీస్ కేంద్రాలను జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు ఎన్ని కలు నిర్వహించి, జిల్లా ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా డెయిరీ సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నివేదికలు అందించాలని కమిటీ సభ్యులకు సూచించారు.
రోడ్డు ప్రమాదాలను నియంత్రిద్దాం
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని.. ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అధిక లోడ్, ఓవర్ స్పీడ్ నియంత్రించేందుకు పోలీస్, రవాణా శాఖాధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలు, మలుపుల వద్ద స్పీడ్ లిమిట్ సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు అంబులెన్స్‌ల ఏర్పాటుతో పాటు ఆస్పత్రికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశాల్లో జిల్లా సహకార అధికారి రఘునాథరావు, డీఏఓ చంద్రశేఖర్, జిల్లా మత్స్యశాఖ అధికారి డా.రజిని, డీటీఓ చిన్నబాలు, జిల్లా డెయిరీ అభివృద్ధి అధికారి ధనరాజ్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment