గిరి‘వికాసం’ ఏది?
సాక్షి, నాగర్‌కర్నూల్: బీడు భూములను సస్యశ్యామలం చేయడంతో పాటు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం సీఎం గిరి వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని చెంచులు, గిరిజనులకు ఈ పథకం కింద పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూరాల్సి ఉండగా.. అవగాహన లేమి, పథకం అమలులో నిర్లక్ష్యం కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. చెంచులు, గిరిజనులకు ఈ పథకం కింద అందాల్సిన ఫలాలు దక్కడం లేదు.
బోర్లతో సేద్యానికి అండ..
గిరిజన రైతులు తమ బీడు భూములను సాగు భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వం గిరివికాసం కింద ఉచితంగా బోరుబావులను తవ్విస్తుంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. భూగర్భ జలవనరులశాఖ అధికారుల ద్వారా సర్వే అనంతరం రైతులు సామూహికంగా బోర్‌వెల్‌ను వినియోగించుకునేందుకు వారిని ఒక గ్రూపుగా ఏర్పాటుచేస్తారు. ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) ద్వారా నిధులను మంజూరుచేస్తారు. రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో అవసరమైన చోట బోరు డ్రిల్లింగ్‌తో పాటు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు, మోటారు బిగింపు వరకు ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాటుచేస్తుంది. అలాగే అధునాతన వ్యవసాయ పద్ధతులు, కూరగాయల సాగు, బండ్ ప్లాంటేషన్, ఉద్యాన పంటల సాగుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే అధికారులు ఈ పథకంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.
‘పదర మండలం పెట్రాల్‌చేను పెంటకు
చెందిన మండ్లి వెంకటమ్మ తమకున్న నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తోంది. వీరికి బోరు, బావి లాంటి సాగునీటి వనరులు లేకపోవడంతో వర్షాల ఆధారంగా పంటను పండిస్తున్నారు. గిరి వికాసం పథకం కింద ప్రభుత్వం గిరిజనులకు కల్పిస్తున్న బోరు సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా బోరు మంజూరు కావడం లేదని చెబుతోంది.’
నామమాత్రంగా పథకం అమలు
అర్హులకు చేకూరని ప్రయోజనం
క్షేత్రస్థాయిలో అవగాహన కరువు
దరఖాస్తుదారులకు
తప్పని ఎదురుచూపులు
అధికారుల మధ్య కొరవడిన
సమన్వయ లోపం
అవగాహన కల్పిస్తున్నాం..
గిరివికాసం పథకం కార్యక్రమాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటాం. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలుపరుస్తాం.
– జాఫర్,
ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్, మన్ననూర్
Comments
Please login to add a commentAdd a comment