లబ్ధిదారుల ఎంపికకు క్షేత్రస్థాయి పరిశీలన
ఊర్కొండ/వెల్దండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో అర్హుల వివరాలను పకడ్బందీగా పరిశీలించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఊర్కొండలో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు.. ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.. సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా.. లేదా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. అదే విధంగా వెల్దండ మండలంలోని కొట్ర రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పక్కన వెలసిన వెంచర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ.. సమగ్ర వివరాలను సేకరించాలని సూచించారు. ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు, సామాజిక ఆర్ధిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచూసుకోవాలన్నారు. రైతుభరోసా పథకానికి సంబంధించి సాగుయోగ్యం కాని భూములను సర్వే నంబర్ల వారీగా పరిశీలించాలని తెలిపారు. భూ భారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. డిజిటల్ సంతకం ఉన్న పట్టాదారు పాస్‌బుక్కులకు సంబంధించి కూడా సదరు భూమిలో పంటలు సాగు చేస్తున్నారా లేదా అన్నది క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా పరిశీలన చేయాలన్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను క్షేత్రస్థాయిలో గుర్తించి, పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. వాటిని సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించాలని తెలిపారు. రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉన్నందున దరఖాస్తుదారుడి కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి గందరగోళం, తప్పిదాలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని గ్రామపంచాయతీల్లో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అర్హుల జాబితా రూపకల్పనలో ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన బృందాల పనితీరును మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామంలో నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను, ఊర్కొండ మండల ప్రత్యేకాధికారి సంతోష్ రావు, తహసీల్దార్లు రాంకోఠి, కార్తీక్ కుమార్, ఎంపీడీఓలు కృష్ణయ్య, సత్యపాల్‌రెడ్డి, ఏఓ దీప్తి, ఎంపీఓ లక్ష్మణ్, ఆర్‌ఐ శైలజ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment