ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
బిజినేపల్లి: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 6,602 మంది విద్యార్థులకు గాను 5331 మంది హాజరయ్యారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
రేపటి నుంచి
ఆర్టిజన్స్ రిలే దీక్షలు
దోమలపెంట: సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్సన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈగలపెంటలోని శక్తి సదన్ వద్ద రిలే దీక్షలు చేపట్టనున్నట్లు రీజినల్ జేఏసీ చైర్మన్లు ఎస్‌కే ఇబ్రహీం, ఎ.శివశంకర్‌రెడ్డి, కన్వీనర్ బి.లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిషన్ ఆధ్వర్యంలో భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈ రామసుబ్బారెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది ఆర్టిజన్స్ ఎన్నో ఏళ్లుగా విద్యుత్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరికి కేవలం వేతనం తప్ప ఇతర ఏ ప్రయోజనాలు పొందడం లేదన్నారు. జెన్‌కో యాజమాన్యం ఆర్టిజన్స్ సేవలను గుర్తించి.. సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య
తలెత్తకుండా చర్యలు
పెంట్లవెల్లి: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు శనివారం పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల్లో ఆర్డీఓ భన్సీలాల్‌తో కలిసి మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్ పర్యటించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై డీఈలు, ఏఈలతో కలిసి ప్రణాళికలను రూపొందించారు. కార్యక్రమంలో ఈఈ సుధాకర్ సింగ్, డీఈఈ అమీద్ పాషా, మల్లేశ్వర్‌రావు, ఏఈ విజయ్, నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ యాదవ్ పాల్గొన్నారు.
హజ్‌యాత్ర నియమాలు నిష్ఠగా పాటించాలి
నాగర్‌కర్నూల్: హజ్ యాత్రికులు నియమాలను నిష్ఠగా పాటించి అల్లా కృపకు పాత్రులు కావాలని కౌరంపేట మదర్సా అధ్యక్షుడు, జామా మసీదు ఖతీబ్ మౌలానా తస్లీం అన్సారీ అన్నారు. జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ జన్మలో హజ్ యాత్ర పవిత్రమైనదని, అల్లా కృపతో హజ్ యాత్రకు సన్నద్ధమైన వారు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. యాత్రికులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ మాట్లాడుతూ.. హజ్ యాత్రకు సంబంధించి ఏ సమాచారం కోసమైనా తమను సంప్రదించాలని సూచించారు. మదీనాలో అవలంబించాల్సిన పద్ధతులను హఫీజ్ మహబూబ్ అలీ వివరించారు. హజ్ సొసైటీ బాధ్యులు అబ్దుల్ హక్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ షంషేర్ ఖాన్, అబ్దుల్ షుకూర్, షేక్ మౌలాపీరా, ఏజాజ్ అహ్మద్, షేక్ నూరుల్ హక్, అలీం మహమ్మద్ షాకీర్ సిద్దిఖి, అబ్దుల్లా ఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment